బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) నేడు (ఏప్రిల్ 15, 2026) ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుదీర్ఘ కాలం పాటు సీఎంగా సేవలందించిన నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో, బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎంగా విజయ్ కుమార్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ (JD-U)కి చెందిన ఇద్దరు నేతలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. సామ్రాట్ చౌదరి గతంలో నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయగా, ఇప్పుడు పూర్తిస్థాయిలో రాష్ట్ర పగ్గాలను చేపట్టారు.
బీహార్ రాజకీయ చరిత్రలో బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 89 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ఇప్పుడు మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ
ఈ కీలక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో వారు బిజీగా ఉండడమే ఇందుకు కారణం.

