సెల్యూట్ టూ ఇండియన్ హీరో!

11
- Advertisement -

ఫ్లైదుబాయ్ విమానంలో గాల్లో ప్రయాణిస్తుండగా కాక్‌‌పిట్‌లో దాడికి దిగిన వ్యక్తిని ఎదుర్కొని, సుమారు 174 మంది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్ వద్ద జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడినప్పటికీ సాహసం ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్యసాహసాలను వీరందరూ కొనియాడారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, స్మిత్ మచ్చార్ చూపిన చొరవ అసాధారణమైనదని అభివర్ణించారు. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చివరి వరకు పోరాడారని తెలిపారు. భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యసాహసాలకు నా సెల్యూట్ అని నెతన్యాహు రాశారు.

దాడికి గురైన తర్వాత కూడా కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరిచారని, దానివల్ల ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని ఆయన పేర్కొన్నారు. కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆయన తిరిగి పోరాడారు. కాక్‌పిట్ తలుపులు తెరచి ప్రయాణికులు, సిబ్బంది దాడి కోరల నుంచి విమానాన్ని కాపాడేలా చేశారు. దీనివల్ల గాల్లో జరగాల్సిన పెద్ద ప్రమాదం తప్పింది అని నెతన్యాహు తెలిపారు. ఆయనను ఒక నిజమైన “హీరో”గా అభివర్ణిస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ గాయపడిన భారతీయ పైలట్‌ను “హీరో” అని కొనియాడారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడానని, కో-పైలట్ ఉగ్రవాది అయి ఉండవచ్చని లేదా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై పైలట్‌పై దాడి చేసి ఉండవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

అత్యవసర సమయంలో కెప్టెన్ మచ్చార్ చూపిన సమయస్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన ధైర్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.
కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఒక రియల్ హీరో. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇతరుల ప్రాణాలను కాపాడాలనే నిశ్చయంతో అపారమైన ధైర్యాన్ని చూపించారు. ఆయన శౌర్యం వందలాది ప్రాణాలను కాపాడటమే కాకుండా ఒక పెద్ద విషాదాన్ని తప్పించింది. కెప్టెన్ మచ్చార్‌ను చూసి భారతదేశం గర్విస్తోంది. ఆయన త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సుమారు 174 మంది ప్రయాణికులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న కమర్షియల్ విమానంలో పైలట్ల మధ్య ఘర్షణ జరగడంతో విమానాన్ని బుధవారం సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి యత్నించి ఉండవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది.

Also Read:ఇకపై ఆ పాత్రలు చేయను!

ఈ ఘటనలో మచ్చార్ ఎదురుతిరగడంతో, ప్రత్యర్థి ఆయనపై కత్తితో దాడి చేశాడు. దాంతో మచ్చార్ తీవ్ర గాయాలతో కాక్‌పిట్ నేలపై పడిపోయారు. ఆ తర్వాత క్యాబిన్ సిబ్బంది, ఒక ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి నిందితుడిని లొంగదీసుకున్నారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

- Advertisement -