ఒక హీరో కోసం కథను తయారు చేసుకుని .. ఆ హీరోతో చేసే అవకాశం లేనప్పుడు, మరో హీరోకి తగినట్టుగా ఆ కథను మార్చడం జరుగుతూ ఉంటుంది. అలా దర్శకుడు కిషోర్ తిరుమల .. నాని కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘చిత్రలహరి’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. అంతేకాదు ఈ సనిమా కోసం నాని డేట్లు కూడా ఇచ్చాడని, త్వరలో పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
కాని తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి నాని తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి నాని ఒక చిత్రం చేయబోతున్నాడు. దాంతో పాటు మరో రెండు పెద్ద చిత్రాలకు నాని కమిట్ అయ్యాడు. అందుకే ఈ చిత్రాన్ని నాని లైట్ తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దానికి తోడు కిషోర్ తిరుమల తీసుకు వచ్చిన ఫైనల్ స్క్రిప్ట్ కూడా నానిని తృప్తి పర్చలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే నాని పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో ఈ సినిమాను సాయిధరమ్ తేజ్ తో చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు శర్వానంద్ తో చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. ‘చిత్రలహరి’ అనే ఓ ‘బార్’ చుట్టూ కథ తిరుగుతుందట. అందువలన ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. వినోదప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంతో పాటే, మిగతా వివరాలను త్వరలోనే వెల్లడి చేయనున్నారు.