గురువారం జగిత్యాలలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను, రాయికల్ కు చెందిన బాలుడు సాగర్ కుటుంబ సభ్యులు కలిసారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన సాగర్ అనే బాబు (13) అప్పటి ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో 2017లో లివర్ మార్పిడి జరిగింది. మూడేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఉన్న సాగర్‌కు సాయం అందించాల్సిందిగా, బాలుడి కుటుంబ సభ్యులు అప్పటి ఎంపీ కవితను కలిశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విని చలించిపోయిన కవిత సాగర్ వైద్యానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
సంబంధిత అధికారులతో మాట్లాడిన అప్పటి ఎంపీ కవిత సాగర్ ఆపరేషన్ నిమిత్తం 26 లక్షల LOCని మంజూరు చేశారు. సాగర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు నిరంతరం వైద్యులతో మాట్లాడారు కవిత. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న సాగర్ పూర్తిగా చలాకీగా ఉన్నాడు. గురువారం జగిత్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితను సాగర్ కుటుంబ సభ్యులు కలిశారు. అనారోగ్యంతో ఉన్న సాగర్‌కు అన్ని విధాలా అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కవితకు సాగర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎట్టకేలకు సాగర్‌ను కలిశానని ట్విట్టర్లో వెల్లడించారు. చిన్నవయసులోనే కాలేయ మార్పిడి చేయించుకుని ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడని చెప్పడానికి గర్విస్తున్నానని పేర్కొన్నారు. అతడికి భగవంతుడు దీర్ఘాయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని కవిత ఆకాంక్షించారు.