తొలిమ్యాచ్‌లోనే సెంచరీ బాది టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయాడు ముంబై కుర్రాడు పృథ్వీ షా. అద్భుతమైన ఫుట్ వర్క్,కవర్ డ్రైవ్స్,గ్రౌండ్ నలువైపులా చక్కటి షాట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓ సీనియర్ ఆటగాడిలా ఎలాంటి ఒత్తిడిలేకుండా 99 బంతుల్లోనే తొలి టెస్టు శతకం సాధించి వహ్వా.. అనిపించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుని భవిష్యత్ స్టార్‌ను తానేనని సగర్వంగా చాటుకున్నాడు.
షా…షోకి సీనియర్ ఆటగాళ్లు ఫిదా అయిపోయారు. ఇది పూర్తిగా షా షో…ఆరంభం మాత్రమే ఈ కుర్రాడిలో చాలా దమ్ముందని సెహ్వాగ్ కొనియాడాడు.అద్భుతంగా ఆడావు యంగ్‌మన్ పృథ్వీషా.. నీలో కొంచెం సెహ్వాగ్ కొంచెం సచిన్‌లున్నారు అని ఆకాశానికెత్తాడు కోచ్ రవిశాస్త్రి.
నీ తొలి ఇన్నింగ్స్‌లో నువ్విలా దాడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఇలానే భయంలేకుండా నీ ఆటను కొనసాగించు అని ట్వీట్ చేశారు సచిన్. భారత్ నుంచి మరో సూపర్ స్టార్ వెలుగులోకి వచ్చాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ప్రశంసించాడు. ఇక భారత మాజీ ఆటగాళ్లు కైఫ్, హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్‌లు సైతం షా ప్రదర్శనను కొనియాడుతూ ట్వీట్ చేశారు.
తనకు విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు షా. ముఖ్యంగా సచిన్ తనను ప్రశంసించడం మధురానుభుతి అని ట్వీట్ చేశాడు.