తన ఆటతీరుతో యావత్ భారతీయుల మనసు గెలుచుకున్న హీరో,క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. సచిన్ చేసిన సేవలకు గాను ఆయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. అయితే, రాజ్యసభకు సచిన్ హాజరుకాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఏప్రిల్ 28న సచిన్ పదవీకాలం ముగియనుండగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరిచేత శభాష్ అనిపిస్తోంది.
ఆరేళ్లలో ఎంపీగా సచిన్‌కు రూ.90 లక్షల జీతం వచ్చింది. తనకు వచ్చిన జీతం, ఇతర అలవెన్సుల మొత్తాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశాడు మాస్టర్ బ్లాస్టర్. ఇది చాలా మంచి పని అని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పీఎంవో కొనియాడింది.
సభకు హాజరుకాకున్న తన ఎంపీ లాడ్స్ ఫండ్స్‌ను మాత్రం వినియోగించుకోవడంలో సక్సెస్ అయ్యాడు సచిన్. ఈ ఆరేళ్లలో వచ్చిన రూ.30 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా 185 పనులకు ఉపయోగించారు. సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద సచిన్ రెండు ఊళ్లను కూడా దత్తతకు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని దోంజా, ఏపీలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాలను అతను దత్తతకు తీసుకొని అభివృద్ధి చేశాడు.