కేరళలోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం భక్తుల రద్దీతో నిండి ఉంది. ప్రతి ఏడాది నిర్వహించే మండల–మకరవిళక్కు మహోత్సవాలు ఈసారి గత నెల 17న ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభం నుంచే భారీగా భక్తులు స్వామి అయ్యప్ప దర్శనానికి తరలి రావడంతో ఆలయానికి తొలి 15 రోజుల్లోనే విక్రమాత్మక రీతిలో ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే గణనీయంగా పెరగడం ప్రత్యేకంగా నిలిచింది. నవంబర్ 30 వరకు శబరిమలను దాదాపు 13 లక్షల మంది భక్తులు సందర్శించినట్లు టీడీబీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని, మకరవిళక్కు వరకు రద్దీ మరింత భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
ట్రావెంకోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజా గణాంకాలను విడుదల చేస్తూ, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు శబరిమలకు వచ్చిన ఆదాయం రూ.92 కోట్లు అని ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో రూ.69 కోట్లు మాత్రమే వచ్చిన నేపధ్యంలో, ఈసారి ఆదాయం 33.33 శాతం పెరిగింది. ఇది ఇటీవల కాలంలో నమోదైన అత్యధిక ప్రారంభ సీజన్ ఆదాయంగా టీడీబీ పేర్కొంది.
ఇందులో ముఖ్యంగా అయ్యప్ప స్వామి ప్రసాదాల విక్రయాలు కీలక పాత్ర పోషించాయి. గతంతో పోలిస్తే ఈసారి ప్రసాదాల అమ్మకాలు భారీగా పెరిగి దాదాపు రూ.47 కోట్లు సమకూరాయి. ఈ గణాంకం గత ఏడాదితో పోల్చితే 46.86 శాతం అధికం. గత సీజన్ తొలి 15 రోజుల్లో ప్రసాదాల ద్వారా కేవలం రూ.32 కోట్లు మాత్రమే వచ్చిన విషయం గుర్తుచేసింది.
Also Read:వైకుంఠ ద్వార దర్శనాలు..భారీ స్పందన
ప్రసాదం ఆదాయంతో పాటు హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అందించిన వివరాల ప్రకారం, హుండీ ద్వారా వచ్చిన సొమ్ము గత ఏడాదితో పోలిస్తే 18.18 శాతం ఎక్కువ. ఆలయానికి భక్తుల రద్దీ పెరిగినదానితో పాటు, శబరిమల తీర్థయాత్రకు సంబంధించిన విశ్వాసం, విశేషాలు కూడా ఈ ఆదాయ పెరుగుదలకు కారణమని బోర్డు పేర్కొంది.

