వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ నిర్వహించిన ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు భారీ స్పందన లభించింది. మొత్తం 1.8 లక్షల దర్శన టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈసారి భక్తుల ఆసక్తి గతసారిలా కాకుండా మరింత పెరగడం ప్రత్యేకంగా గుర్తించవచ్చు.
రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా భక్తులు స్పందించారు. మొత్తం 13.4 లక్షల మంది యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం. అలాగే టీటీడీ వెబ్‌సైట్ ద్వారా 9.3 లక్షల మంది, ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ సేవ ద్వారా 1.5 లక్షల మంది భక్తులు నమోదు పూర్తిచేశారు.
డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1న నూతన సంవత్సరం దర్శనాలు జరగనున్న నేపధ్యంలో, ఈ మూడు రోజుల కోసం అందించే దర్శన టోకెన్లు పూర్తిగా ఈ-డిప్ ద్వారా కేటాయించబడతాయి. రిజిస్ట్రేషన్ ముగియడంతో త్వరలోనే టోకన్ లక్కీ డ్రా ఫలితాలను టీటీడీ ప్రకటించనుంది.
అంతటి భారీ సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపడం నేపథ్యంలో, ఈసారి తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత రద్దీగా జరగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Also Read:ఓట్ల కోసం సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన

