యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ -శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కి న చిత్రం సాక్ష్యం. బెల్లంకొండ సరసన గ్లామర్ డాల్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ప్రమోషన్ కార్యక్రమాలతోనే ఆసక్తి రేకెత్తించిన సాక్ష్యం సినిమాతో శ్రీనివాస్ ఆకట్టుకున్నాడా..? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…
కథ:
తనకు అడ్డువస్తున్నాడని రాజావారి కుటుంబం(శరతకుమార్ ఫ్యామిలీ) కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు జగపతిబాబు బ్రదర్స్. చిన్నపిల్లలు,పశువులతో సహా అందరిని చంపేస్తారు. కానీ ఈ ఘాతుకం నుంచి తప్పించుకుంటాడు సాయి శ్రీనివాస్. విదేశాల్లో పెరిగి పెద్దవాడైన శ్రీనివాస్ తన ఫ్యామిలీని చంపిన వాళ్లపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే సాక్ష్యం మూవీ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ మేకింగ్,యాక్షన్ సీన్స్, పంచభూతాల కాన్సెప్ట్. సినిమా సినిమాకీ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు ఆకట్టుకోవాలన్న ఆలోచన సాయి శ్రీనివాస్‌కు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకు ఈ కథ మరింత బలాన్ని ఇచ్చింది. విశ్వ పాత్రలో మనం ఊహించని మెరుపులు ఏవీ లేకపోయినప్పటికీ ఆ పాత్రకు తగ్గట్టు చక్కగానే రాణించాడు సాయి శ్రీనివాస్. ఎమోషన్ డైలాగ్స్ చెప్పే సన్నివేశాల్లో ఇంకాస్త పరిణతి చూపించాల్సి ఉంది. పూజా హెగ్డే పాటల్లో ఒకలా, సన్నివేశాల్లో మరోలా కనిపించింది. మరీ బక్క చిక్కినట్లు కనిపించడం ఓ మైనస్. విలన్ గ్యాంగ్‌లో నలుగురు ఉన్నా, ప్రధాన ఫోకస్ అంతా జగపతిబాబుపైనే. వేమన శతకాలు చెబుతూ, విలనిజాన్ని వినూత్నంగా పండించాలని చూశారు. వెన్నెల కిషోర్, కృష్ణభగవాన్, రఘుబాబు, పోసాని, రావు రమేష్ ఇలా నట బృందంలో చాలా మందే కనిపిస్తారు. అయితే, కథంతా కథానాయకుడు, పంచ భూతాల చుట్టూ తిరుగుతుంది.
మైనస్ పాంయిట్స్:
సినిమాలో మైనస్ పాంయిట్స్ కథనం మధ్యలో ఇబ్బంది పెట్టే పాటలు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు సంబందలేకుండా ఉంటాయి , హీరో సాయి శ్రీనివాస్ ఎమోషన్ డైలాగ్స్ చెప్పే సన్నివేశాల్లో ఇంకాస్త పరిణతి చూపించాల్సి ఉంది. పూజా హెగ్డే పాటల్లో ఒక విధంగా, సన్నివేశాల్లో మరో విధంగా కనిపించడంతో ప్రేక్షకులు నిరుత్సాహపడ్డారు. మరీ బక్క చిక్కినట్లు కనిపించడం కూడా ఓ మైనస్.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాకు రూ.40కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు నిర్మాతలు చెప్పారు. ఆ ఖర్చు తెరపై కనిపించింది. సినిమా చాలా రిచ్‌గా ఉంది. పాటలు పర్వాలేదనిపించినా, నేపథ్య సంగీతంలో తడబడ్డాడు సంగీత దర్శకుడు. బుర్రా సాయిమాధవ్ అందించిన సంభాషణలు అక్కడక్కడా మెరిశాయి. దర్శకుడు పంచ భూతాలను ఆధారం చేసుకుని, ఓ మామూలు కథను వినూత్నంగా చెప్పాడు. మాస్, యాక్షన్ ప్రియులకు కావాల్సిన అంశాలను పొందికగా కూర్చడంలో సఫలీకృతమయ్యాడు.
తీర్పు:
పగ, ప్రతీకారాల నేపథ్యంలో వచ్చిన సినిమాలను చాలానే చూశాం. అయితే, దానికి ఓ కొత్త నేపథ్యం ఎంచుకోవడంలోనే విజయం దాగుంది. కథానాయకుడు తన తల్లిదండ్రులను చంపిన వారిని ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ చంపాడు అనే పాయింట్ చాలా బలహీనంగానూ, రొటీన్‌గానూ కనిపిస్తుంది. అయితే దానికి పంచభూతాలు అనే నేపథ్యాన్ని తెలివిగా జోడించాడు దర్శకుడు. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం ఈ పంచభూతాలను దర్శకుడు తెలివిగా వాడుకున్నాడు. వాటిని ఉపయోగించి, శత్రు సంహారం ఎలా చేశాడో తెలియాలంటే ఈ సినిమా చూడాలి. తొలి పది నిమిషాలు చాలా పట్టుగా, ఉత్కంఠ భరితంగా తెరకెక్కించగలిగాడు. అయితే, ఆ తర్వాత విదేశాల్లో సాగిన విశ్వ, సౌందర్య లహరి(పూజ)ల ప్రేమకథ కాస్త విసిగిస్తుంది. వీడియోగేమ్‌ల నేపథ్యం కూడా అదే బాపతు. కథానాయకుడిని ఇండియా తీసుకొచ్చాక, శత్రు సంహారం మొదలు పెట్టిన తర్వాతే కథ జోరందుకుంది.
విశ్రాంతి ఘట్టం మరోసారి ఉత్కంఠ రేకెత్తించేలా సాగడంతో ప్రథమార్ధం గట్టెక్కగలిగింది. రెండో భాగంలో మిగిలిన శత్రువులను కథానాయకుడు చంపే విధానం ఆద్యంతం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించగలిగాడు. యాక్షన్ ఎపిసోడ్ ఒక్కోటి ఒక్కో తరహాలో సాగుతుంది. పంచ భూతాలను యాక్షన్ ఎపిసోడ్‌లో మేళవించాలన్న ఆలోచన రొటీన్ కథను సరికొత్తగా ఆవిష్కరించింది. కథానాయడికి తన గతం తెలియకుండా దాస్తూనే, తనకు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేలా చూపించడం కొత్త ఎత్తుగడ. మొత్తంగా చెప్పాలంటే, ఒక సగటు కథను, ఒక కొత్త నేపథ్యం ఎంచుకుని, భారీ హంగులు జోడించి, తెరకెక్కించడంలో దర్శక-నిర్మాతలు విజయం సాధించారు.
విడుదల తేదీ:27/07/2018
రేటింగ్:3.2/5
నటీనటులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే
సంగీతం: హర్షవర్ధన్
నిర్మాత: అభిషేక్ నామా
రచన-దర్శకత్వం: శ్రీవాస్