తెలంగాణను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎర్రబెల్లి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి… సీఎం కేసీఆర్ రైతువేదికను ప్రారంభించాక సమీపంలోని పల్లె ప్రకృతివనాన్ని సందర్శిస్తారని చెప్పారు. అనంతరం డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసే సభలో 5 వేల మంది రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు.
అసంఘటితంగా ఉన్న రైతులందరినీ ఒకచోట చేర్చేలా సీఎం కేసీఆర్ రైతువేదికల నిర్మాణానికి రూపకల్పన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,462, పట్టణ ప్రాంతాల్లో 139 కలిపి మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.350 కోట్లు కేటాయించింది. ఒక్కోదానిని 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.22 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే 2,500 వరకు (96 శాతం) నిర్మాణం పూర్తికాగా.. పదిహేను రోజుల్లో మొత్తం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.