కర్ణాటక శాసన మండలిలో రసాభాస.. వీడియో

66
karnataka

ఈనెల 7 నుంచి కర్ణాటక మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం కర్ణాటక శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే సభలో రసాభాస చోటు చేసుకుంది. శాసన మండలిలోనే సభ్యులు బాహాబాహీకి దిగారు. అసలు శాసన మండలిలో ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీ, జేడీఎస్‌లు కలిసి ఒకరిని ఛైర్మన్ స్థానంలో అక్రమంగా కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు గొడవపడడం కలకలం రేపుతోంది. కొందరు సభ్యులను మరికొందరు సభ్యులు బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. శాసన మండలిలో బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు.

గోవధ నిషేధ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ మండలి ఛైర్మన్‌ కె. ప్రతాపచంద్ర శెట్టిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అధికార, కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆయన సభకు వచ్చే ముందు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ, డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌ఎల్‌ ధర్మే గౌడను చైర్మన్‌ సీటులో కూర్చోబెట్టారు. దీంతో రాజ్యాంగం ప్రకారం ఆయనకు కుర్చీలో ఉండే అర్హత లేదని, తమ పార్టీకి చెందిన చంద్రశేఖర్‌ పాటిల్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలంటూ వాదనకు దిగారు. అనంతరం ధర్మే గౌడను లాగిపడేశారు. ఇంతలో మండలిలోకి వచ్చిన చైర్మన్‌ ప్రతాపచంద్ర శెట్టి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.