తెలంగాణలో గ్రీన్ ఎస్ఎం (GREEN SM) కంపెనీ కార్యకలాపాలపై బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కంపెనీ రాకతో రాష్ట్రంలోని లక్షలాది మంది క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇందిరమ్మ పాలనలో తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. అసలు గ్రీన్ ఎస్ఎం కంపెనీకి తెలంగాణలో అనుమతులు ఇచ్చిందెవరు? అని ప్రశ్నించారు.
ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో మూటలు అప్పగించిన తర్వాతే గ్రీన్ ఎస్ఎం కంపెనీ తెలంగాణలోకి వచ్చిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ కంపెనీ కార్యకలాపాల వల్ల స్థానిక క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని క్యాబ్ డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
గ్రీన్ ఎస్ఎం కంపెనీ కార్యకలాపాలను ప్రభుత్వం వెంటనే నియంత్రించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి డబ్బులను వియత్నాంకు పంపడం కాకుండా, అక్కడి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని అన్నారు.
రాష్ట్రంలోని క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. క్యాబ్ డ్రైవర్లకు వెంటనే రేట్ కార్డు జారీ చేసి, వారి ఆదాయానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.డ్రైవింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Also Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026

