ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే రూ.2.5 లక్షలు మాయం!

1
- Advertisement -

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. కేవలం ఓ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసినందుకే ఓ మాజీ సైనికుడి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.2.5 లక్షలు మాయమయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిగూడకు చెందిన మాజీ సైనికుడు రాజవర్ధన్ తన మొబైల్ ఫోన్‌లో ఓ ప్రకటనను చూస్తున్నారు. అదే సమయంలో ఆయనకు గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయన ఆ కాల్‌ను లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం కాల్‌ను కట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన ఫోన్‌లో అనుమానాస్పదంగా ఓ APK ఫైల్ డౌన్‌లోడ్ అయినట్లు గుర్తించారు.

కొద్దిసేపటికే తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా రూ.2.5 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తెలుసుకుని రాజవర్ధన్ షాక్‌కు గురయ్యారు. తన అనుమతి లేకుండానే నగదు బదిలీ కావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన కాల్ తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ APK ఫైల్ ఎలా డౌన్‌లోడ్ అయింది? సైబర్ నేరగాళ్లు ఏ విధంగా బ్యాంకు ఖాతాలోని నగదును బదిలీ చేశారు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్, లింకులు, APK ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయకుండా, మొబైల్‌కు అవసరం లేని అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.

Also Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026

- Advertisement -