ఐపీఎస్ పదవికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ అంశాలపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చేప్పలేనన్న ఆయన.. హుజురాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం నాకులేదని స్పష్టం చేశారు. పేదల పక్షాన ఉండాలనే పదవీ విరమణ చేశానని.. స్వేరోస్ లోని విద్యార్ధులేవరూ అధైర్యపడొద్దు.. నాకంటే మంచి అధికారులు వస్తారన్నారు.
26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు.
1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్‌కుమార్… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. ముఖ్యంగా స్వేరోస్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.