కేంద్రమంత్రికి..రూ.99 లక్షల సబ్సిడీ!

0
- Advertisement -

సొంత మంత్రిత్వ శాఖ నుండే సబ్సిడీ పొందారు ఓ కేంద్రమంత్రి. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని ఒక విస్తారమైన వ్యవసాయ క్షేత్రంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పాలీహౌస్‌లు ఉన్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఒక తెల్లటి సైన్‌బోర్డుపై అసిస్టెడ్ బై నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా . ఆ బోర్డు ప్రకారం… లబ్ధిదారుడి పేరు…మిస్టర్ భాగీరథ్ చౌదరి… పొందిన సబ్సిడీ మొత్తం: 50% అంటే (రూ. 99,60,000) లక్షలు. అయితే ఆ బోర్డుపై ప్రస్తావించని ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే….ఈ సబ్సిడీ పొందిన భాగీరథ్ చౌదరి మరెవరో కాదు… ప్రస్తుతం కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి (MoS).

ఓ జాతీయ దినపత్రిక జరిపిన ప్రత్యేక పరిశోధనలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ బోర్డు (నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ – NHB) ద్వారా ఈ సబ్సిడీ మంజూరైందో అదే బోర్డుకు కేంద్ర మంత్రి భాగీరథ్ చౌదరి ఎక్స్-అఫీషియో వైస్-ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అంటే తాను వైస్-ప్రెసిడెంట్‌గా ఉన్న బోర్డు పరిధిలోని పథకం నుంచే ఆయన తన సొంత వ్యవసాయ ప్రాజెక్టుకు రూ. 99 లక్షలకు పైగా సబ్సిడీని పొందారు.

రాజస్థాన్‌లోని దీద్వానా-కుచామన్ జిల్లా పరిధిలోని పీహ్ (Peeh) గ్రామంలో మంత్రి భాగీరథ్ చౌదరికి సొంతంగా వ్యవసాయ భూమి ఉంది. అక్కడ 16,592 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కీరదోస సాగు కోసం ఆయన ఒక భారీ ప్రాజెక్టును చేపట్టారు.

మొత్తం ప్రాజెక్టు వ్యయం: రూ. 1,99,20,000 (సుమారు రూ. 1.99 కోట్లు).మంత్రి వాటా: రూ. 49,80,000 (రూ. 49.8 లక్షలు) కాగా ఈ ప్రాజెక్టు కోసం హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ నుండి రూ. 1,49,40,000 (రూ. 1.49 కోట్లు) రుణం తీసుకున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం అనగా రూ. 99,03,000 (రూ. 99 లక్షలు) నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ నుండి సబ్సిడీ రూపంలో నేరుగా మంత్రి లోన్ ఖాతాకు జమ అయింది.

అజ్మీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచి 2024 నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న భాగీరథ్ చౌదరి… ఈ పథకం కింద సబ్సిడీ కోసం ఏప్రిల్ 15, 2025న దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన కేవలం 14 రోజుల్లోనే (ఏప్రిల్ 29, 2025న) ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక అనుమతులు లభించాయి. మార్చి 11, 2026న ఎన్‌హెచ్‌బీ నుంచి తుది క్లియరెన్స్ రాగా మార్చి 30, 2026 నాడే రూ. 99.03 లక్షల సబ్సిడీ సొమ్ము మంత్రి లోన్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోయింది.

Also Read:ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’

అయితే గతంలో (2018లో) ఇదే పథకం కోసం చౌదరి దరఖాస్తు చేసుకోగా అప్పట్లో అది తిరస్కరణకు గురైంది. అలాగే అదే ఏడాది ఆయన కుమారుడు సుభాష్ చౌదరి దరఖాస్తు కూడా గైడ్‌లైన్స్ ప్రకారం లేదంటూ తిరస్కరించబడింది. కానీ భాగీరథ్ చౌదరి కేంద్ర మంత్రి అయ్యాక అదే బోర్డుకు వైస్-ప్రెసిడెంట్ హోదాలో ఉన్న సమయంలో ఈ దరఖాస్తుకు వెంటనే ఆమోదం లభించడం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) సమర్పించిన ఆస్తుల డిక్లరేషన్‌లో తనకు పీహ్ గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నప్పటికీ, ఈ సబ్సిడీ ప్రాజెక్టు గురించిన వివరాలను ఎక్కడా ప్రస్తావించలేదు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఆమోదించబడిన కేవలం 467 ప్రాజెక్టులలో కేంద్ర మంత్రి ప్రాజెక్టు కూడా ఒకటి కావడం గమనార్హం.

- Advertisement -