గాలి కుమార్తె పెళ్లి ఖర్చు రూ.30 కోట్లేనట…!

121
Rs 30 crore for Janardhan Reddy Daughters Marriage

కుమార్తె పెళ్లితో దేశం దృష్టిని ఆకర్షించిన మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆ పెళ్లికి ఖర్చు చేసింది ఎంతో తెలుసా? కేవలం రూజ30 కోట్లేనట. వివాహ ఆహ్వాన కార్డుతోనే సంచలనం సృష్టించిన గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి పెళ్లికి దాదాపుగా రూ.400 కోట్లకు పైగా ఖర్చైనట్లు వార్తలొచ్చాయి. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని చెవులు కొరుక్కున్నారు. దీంతో ఐటీ శాఖ అధికారులు గాలి పెళ్లిపై నిఘా పెట్టి…నోటీసులు జారీ చేశారు. దీంతో అంతా మరోసారి గాలికి ఇబ్బందులు తప్పవని భావించారు. అయితే,గాలి మాత్రం తన కుమార్తె పెళ్లికి రూ.30 కోట్లే ఖర్చయ్యాయని తెలిపాడు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆయన లెక్కలు చూపారు.

తదనంతరం పెళ్లి కోసం పెద్దమొత్తంలో రద్దయిన నోట్లను అక్రమ పద్ధతుల్లో కొత్త నోట్ల రూపంలోకి మార్చుకున్నారని గాలిపై ఆరోపణలు వచ్చాయి. కనీసం రూ. 2 వేలైనా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో గాలి ఇంతపెద్దమొత్తంలో ఖర్చు చేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పట్టుబడిన కర్ణాటక రెవెన్యూ అధికారి భీమానాయక్‌. గాలికి సంబంధించిన పెద్దనోట్లు మార్పిడిలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. తన భార్య అరుణాలక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న ట్యూబుల్‌ రివేట్స్‌ నుంచి నిధుల సమకూర్చినట్లు ఆయన తెలియజేశారు. కొనుగోళ్లు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపినట్లు పేర్కొన్నారు.

గత నవంబరులో బెంగళూరులోని ప్యాలెస్‌లో అత్యంత అట్టహాసంగా బ్రహ్మణి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహా మహోత్సవానికి సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వీఐపీలు హాజరయ్యారు. దాదాపుగా 50 వేల మందికిపైగా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే, కేవలం రూ.30 కోట్లే ఖర్చయ్యాయని చెప్పడం పట్ల నెటిజన్లు ఉహించని  స్పందన వస్తోంది. సెటైరికల్ కామెంట్లతో గాలిని తూర్పారా బడుతున్నారు.