వివాదాల చుట్టూ పరిభ్రమిస్తూ … సంచలనాలే తన ‘ ప్రచార అస్త్రాలు ‘గా చేసుకొనే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘ గ్యాంగ్ స్టర్ నయీమ్ ‘ యథార్థ కథపై కన్నేసిన సంగతి తెలిసిందే. నయీమ్ జీవిత కథలో పలు అంశాలను స్పృశిస్తూ మూడు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నయీమ్ అనుచరుల నుంచి రాముకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. దీనిపై తనదైన శైలిలో స్పందించారు రాము.
నయీం అనుచరుల నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి. కానీ నేను నయీమ్‌లకే నయీమ్‌నన్న విషయాన్ని వారు తెలుసుకోవాలి. ప్రస్తుతం ముంబయి జైలులో ఉన్న నయీం సన్నిహితుడిని, నయీమ్‌కు సాయం చేసిన ఐదుగురు పోలీసులను, నయీమ్‌తో మూడేళ్లు కలిసి పనిచేసిన ఇద్దరు నక్సలైట్లను కలిశా. నయీం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను కానీ.. అతనికి కరాచీకి చెందిన ఓ వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని తెలిసి షాకయ్యా. అంతేకాదు నయీం తన మరదలి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించాడో కూడా తెలుసుకున్నాను. అని ట్వీట్ చేశారు వర్మ.
హిందీలో ‘సత్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’.. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి సినిమాలు తెరకెక్కించారు వర్మ. ప్రస్తుతం వర్మ కన్ను గ్యాంగ్‌స్టర్ నయీమ్ మీద పడటంతో నయీమ్ ట్రయాలజీ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో.