సుమంత్‌ రెండో పెళ్లి.. ఆర్టీవీ ఆసక్తికర కామెంట్స్‌..!

92
RGV

టాలీవుడ్‌ హీరో అక్కినేని సుమంత్ రెండో పెళ్లిపై చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతుంది.. ప‌విత్ర అనే అమ్మాయిని సుమంత్‌ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక పెళ్లి కార్డు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. SP పేరుతో ఈ పత్రిక ఉండటంతో నిజంగానే సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని అంతా అనుకున్నారు.

ఈ విష‌యం తెలిసి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం సుమంత్ రెండో పెళ్లి విష‌యంపై స్పందించాడు. ఒక్క‌సారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ది రాలేదా సుమంత్‌.. నీ ఖ‌ర్మ‌.. ఆ ప‌విత్ర ఖ‌ర్మ‌.. అనుభ‌వించండి అంటూ ఘాటుగా స్పందించాడు. పెళ్లి మానుకోమ‌ని హిత‌బోధ కూడా చేశాడు. దీనికి సుమంత కూడా అదే స్టైల్‌లో స్పందించాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య జరిగిన సంభాష‌ణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సుమంత్ రెండో పెళ్లి వార్త‌ల‌పై రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ.. ఒక పెళ్లే నూరేళ్ల పెంట అయితే.. రెండో పెళ్లి ఏంట‌య్యా స్వామి.. నా మాట విని మానేయ్యి.. ప‌విత్ర గారు, మీ జీవితాల్ని పాడు చేసుకోకండి.. త‌ప్పు మీది కాదు సుమంత్‌ది గాదు.. త‌ప్పు ఆ దౌర్భాగ్య‌పు వ్య‌వ‌స్థ‌ది అంటూ ట్వీట్ చేశాడు.

ఆర్జీవీ ట్వీట్‌పై స్పందించిన సుమంత్‌.. త‌న రెండో పెళ్లి వార్త‌ల‌ను కొట్టిపారేశాడు. విడాకుల నేప‌థ్యంలో ఒక‌ సినిమాలో న‌టిస్తున్నాన‌ని.. ఆ సినిమాలోని స్టిల్ ఒక‌టి లీక్ కావ‌డంతో ఈ పుకార్లు మొద‌ల‌య్యాయ‌ని క్లారిటీ ఇచ్చాడు. అంతేత‌ప్ప రియ‌ల్ లైఫ్‌లో తాను పెళ్లి చేసుకోవ‌ట్లేద‌ని స్ప‌ష్టం చేశాడు. అంతేకాకుండా త‌న మీద చూపిన అభిమానానికి ఆర్జీవీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

దీంతో ఆర్జీవీ మ‌రోసారి త‌న‌దైన శైలిలో స్పందించాడు. రెండో పెళ్లిపై వ‌చ్చిన పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చినందుకు నీ త‌ర‌ఫున దేవుడు, దెయ్యాల‌కు నా థ్యాంక్స్‌. అంద‌రూ మ‌ళ్లీ మొద‌లైంది సినిమా చూడాలని కోరుకుంటున్నా.. అని రిప్లై ఇచ్చాడు. పెళ్లిళ్లు న‌ర‌కంలో నిర్ణ‌యించ‌బ‌డ‌తాయ‌ని అన్న ఆర్జీవీ.. పెళ్లి గురించి న‌మ్మ‌లేని స‌త్యాల‌ను ఈ సినిమా చూసి తెలుసుకోవాల‌ని సూచించారు.