దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘జీఎస్టీ’ వెబ్ చిత్రం పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) వివాదంతో పాటు చర్చలలో మహిళలని అగౌరవపరుస్తూ కొన్నివివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత నెల 25న సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ముంబైలో ఉన్న వర్మకి నోటీసులు పంపారు. అయితే షూటింగ్ బిజీలో ఉన్న తాను విచారణకి హాజరు కాలేనని, మరో సారి నోటీసులు పంపితే తప్పక హాజరు అవుతానని వర్మ తన లాయర్ ద్వారా కోర్టుకి తెలియజేశారు.
ఈ క్రమంలో సైబర్ క్రైమ్ అధికారులు మరోసారి వర్మకి నోటీసులు పంపారు. వీటిని అందుకున్న వర్మ ఈ రోజు విచారణకి హాజరు అవుతానంటూ సమాచారం. ఆయనని విచారేందుకు ప్రత్యేక బృందం కూడా సిద్ధంగా ఉందని వార్తలు వస్తుండగా, మరి విచారణ ఏ కోణంలో సాగనుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. వర్మ చేసిన వ్యాఖ్యలపై ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం పోలీసు విచారణ కోసం వర్మ సీసీఎస్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వొకేట్ కూడా వచ్చారు. కార్యాలయంలోకి వీరిద్దరిని తప్ప, మరెవరినీ అనుమతించలేదు.
దీనికి ముందు… ఓ టీవీ ఛానల్ తో సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ, వర్మను పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్పారు. అందరిలాగానే సామాన్య నిందితుడిగానే వర్మను పరిగణిస్తామని… చట్టం దృష్టిలో అందరూ సమానమే అని తెలిపారు. జీఎస్టీ సినిమాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్, మహిళలను కించపరిచేలా మాట్లాడారనే దానికి సంబంధించి మరొక ఎఫ్ఐఆర్ ఆయనపై నమోదయ్యాయని… వీటన్నింటిపై విచారణ జరుగుతుందని అన్నారు. దాదాపు 4 గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పారు.