సీక్వెల్స్ సినిమాల ట్రెండ్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్తకాదు. అయితే, ఓ సిరీస్‌గా సినిమాలు రావడం టాలీవుడ్,కోలీవుడ్ ఇండస్ట్రీలకు కొత్త. సింగం, సింగం 2తో మెప్పించిన సూర్య అదే ట్రెండ్‌తో భారీ బడ్జెట్‌తో నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఇప్పటివరకు ఈరెండు ఇండస్ట్రీలో ఒకే హీరో, దర్శకుడు సీక్వెల్ సినిమా చేయటం చాలా అరుదు. ఇలా ముచ్చటగా మూడో సారి ఎస్ 3 తెలుగులో యముడు 3గా విడుదలైన సూర్య పోలీస్ సింహంతో మరోసారి హంగామా సృష్టించాడా.. ?మూడు నెలలుగా వాయిదా పడుతు వస్తున్న ఎస్ 3తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం.
కథ :
ఏపీలో పేరు మోసిన పోలీసాఫీసర్ అయిన నరసింహ (సూర్య)ను కర్ణాటక హోం మంత్రి (శరత్ బాబు) ప్రత్యేకంగా ఒక మిషన్ మీద మంగళూరుకు డెప్యుటేషన్‌పైన రప్పిస్తాడు. ఒక కమీషనర్ హత్యకు సంబంధించిన కేసును నరసింహకు అప్పగిస్తారు. నరసింహ ఆ కేసును తనదైన శైలిలో విచారించి హంతకులను తొందరగానే పట్టుకుంటాడు. అయితే ఈ క్రమంలోనే కమీషనర్ కేసు వెనుక చాలా పెద్ద కథ ఉందని, విఠల్ (అనూప్ సింగ్) అనే ఓ పెద్ద వ్యాపారవేత్త ఈ హత్య వెనుక ఉన్నాడని తెలుసుకుంటాడు. తర్వాత ఏం జరుగుగుతుంది..? కథను ఎలా సుఖాంతంగా ముగించాడు అన్నదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సూర్య ,యాక్షన్ ఎపిసోడ్‌లు, ఫస్టాఫ్‌కు ముందు వచ్చే సన్నివేశాలు. సింగం సిక్వెల్‌కు తగ్గట్టుగా సూర్య తనదైన నటనతో అభిమానులను అలరించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య చెప్పిన డైలాగులు, చేసిన ఫైట్స్ బాగా అలరించాయి. యాక్షన్ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దారు దర్శకుడు హరి. అందుకు సంబంధించిన సన్నివేశాలు మాస్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
గ్లామరస్ భామ శృతి తనదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటల్లో తన అందచందాలతో కనువిందు చేసింది. సెకండాఫ్ లో వచ్చే హెవీ యాక్షన్ సన్నివేశాలు చాలా పవర్ ఫుల్, రేసీగా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.విలన్ పాత్రల్ని పోషించిన వారిని దర్శకుడు స్టైలిష్‌గా చూపించాడు. రాధిక నటన ఆకట్టుకుంటుంది
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ, కథనం, కామెడీ లేకపోవడం. ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్ కూడా కథలో ఇమడనట్లుగా ఉందనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ‘యముడు -2’ కళ్ళముందు కదిలినట్టే అనిపించింది.
సాంకేతిక విభాగం :
సంగీతం పరంగా హారిస్ జయరాజ్ మాస్‌కు నచ్చేలా బాణీలు అందించారు. అయితే తెలుగు పాటల వరకు సాహిత్యం సరిగా వినిపించలేదు. నేపథ్య సంగీతంలో హుషారు చూపించారు. శశాంక్ వెన్నెల కంటి మాటలు అక్కడక్కడ మెరుస్తాయి. మాటల్లో కూడా ఎక్కువగా తమిళ నేటివిటీ కనిపిస్తుంటుంది. స్క్రీన్‌ప్లే విషయంలో హరి సిద్ధహస్తుడు.. అయితే ఆ మాయాజాలం ఈ సినిమాలో అంతగా కనిపించలేదు. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
‘సింగం’ సిరీస్ అనగానే.. యాక్షన్స్ సీన్స్, భారీ డైలాగులు గుర్తుకొస్తాయి. ఇలా యాక్షన్ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాను తెరకెక్కించారు దర్శకుడు హరి. ‘సింగం 3’లో ఫైట్స్, డైలాగ్స్ బాగానే ఉన్నా, అసలు కథ, దానికి రాసుకున్న స్క్రీన్‌ప్లే మరీ రొటీన్‌గా ఉండడం నిరుత్సాహపరచే అంశం. సూర్య పవర్‌ఫుల్ డైలాగ్‌లు.. మేనరిజం.. ఫైట్స్, బలమైన విలన్ పాత్ర సినిమాకు ప్లస్ కాగా కామెడీ, బలహీనమైన కథ సినిమాకు మైనస్. మొత్తంగా యాక్షన్ చిత్రాలను కోరుకునే వారికి నచ్చే సూర్య …. ఎస్ 3.
విడుదల తేదీ : 09/02/2017
రేటింగ్ : 3/5
నటీనటులు : సూర్య, శృతి హాసన్, అనుష్క
సంగీతం : హరీస్ జైరాజ్
నిర్మాతలు : జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం : హరి

