చిన్నమ్మకు చుక్కలు చూపిస్తున్న పన్నీర్

201
Panner selvam
- Advertisement -

అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ చుట్టు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉచ్చుబిగిస్తున్నారు. ఉహించని నిర్ణయాలతో చిన్నమ్మను ఉక్కిరిబిక్కరి చేస్తున్నారు. సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్‌ రావును శశకళ కలవనున్న నేపథ్యంలో పన్నీర్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనానికి కేంద్ర బిందువుగా మారాయి.  ఇప్పటికే పోయెస్ గార్డెన్ ను అమ్మ స్మారక ప్రదేశంగా మార్చిన పన్నీర్ చెన్నై పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శశికళ పోయెస్‌ గార్డెన్‌లోనే ఉంటుండగా దానిని స్మారక చిహ్నంగా మార్చితే ఆమె ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది.

ఇక అన్నాడీఎంకే కోశాధికారి హోదాలో తన అనుమతి లేకుండా పార్టీ అకౌంట్‌కి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీలులేదంటూ బ్యాంకులకు లేఖరాశారు. అధికార యంత్రాంగాన్ని ఓ వైపు ప్రయోగిస్తునే మరోవైపు శశికళపై విమర్శనాస్త్రాలు సందిస్తునే ఉన్నారు. తాజాగా ఆయ‌న ఆ రాష్ట్ర‌ డీజీపీ రాజేంద్ర‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి గిరిజాతో భేటీ అయిన పన్నీర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంద‌రూ ఎక్క‌డ ఉన్నా బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మ‌రోవైపు పన్నీర్ సెల్వంకి బ‌లం క్ర‌మంగా పెరుగుతూ వెళుతోంది.

తొలుత శశికళ శిబిరంలో 120 నుంచి 130 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కీలకనేతలతో మంతనాలు జరుపుతున్న పన్నీర్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. మొత్తంగా పన్నీర్ తీసుకుంటున్న నిర్ణయాలతో శశికళకు ఉపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు గవర్నర్ నిర్ణయం కోసం ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -