రివ్యూ:ఎం ఎస్‌ ధోనీ

276
- Advertisement -

భార‌త క్రికెట్ కెప్టెన్ ఎం ఎస్ ధోని జీవిత క‌థ ఆదారంగా హిందీలో రూపొందుతున్న మూవీ ఎం ఎస్ దోని – ద అన్ టోల్డ్ స్టోరి.. ఈ మూవీలో ధోనిగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ధోనీ కథ తెరపై ఎలా ఆవిష్కరించబడిందో చూద్దాం..

dhoni

కథ :
కెప్టెన్ కూల్ ధోనీ జీవిత కథను ఎవ్వరూ చూడని కోణం నుంచి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా‘ఎం.ఎస్.ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ’. క్రికెట్ అంటే ప్రాణమున్న ధోనీ టీటీఈ ఉద్యోగంలో ఎందుకు చేరాడు? ఉద్యోగం చేసుకుంటూనే ఇండియన్ క్రికెట్‌లో చోటు కోసం ధోనీ ఎలా కష్టపడ్డాడు? ఆ తర్వాత కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు? వరల్డ్ కప్ సాధించడంలో అతడి వ్యూహాలేంటి? లాంటి అంశాలను ఎమోషనల్‌గా, ఎక్కువగా ధోనీ వ్యక్తిగత జీవితాన్నే స్పృశిస్తూ చెప్పిన కథే క్లుప్తంగా ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌. అచ్చం ధోనీలా మారేందుకు సుశాంత్‌ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ధోనీలా క్రికెట్ ఆడడం.. ధోనీని అనుకరించడంలో అసాధారణ నటనను ప్రదర్శించాడు సుశాంత్. కేవలం అప్పియరెన్స్‌లో మాత్రమే కాకుండా సినిమా మొదటి నుండి చివరి వరకు ఎంతో ఎమోషనల్‌గా నటించాడు. ధోనీ గాళ్‌ఫ్రెండ్‌గా దిశా పఠానీ సరిపోయిందని చెప్పవచ్చు. ధోనీ తండ్రిగా అనుపమ్ ఖేర్, ధోనీ అక్కగా భూమిక అందరూ తమ పాత్రలతో, నటనతో సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చారు.

ఫస్టాఫ్ మొత్తం ఇండియన్ క్రికెట్‌కు సెలెక్ట్ అవ్వడంలో ధోనీ పడిన కష్టాలను ప్రస్తావిస్తూ, ఎమోషనల్‌గా నడుస్తూ కట్టిపడేసింది. సినిమాలో వచ్చే రెండు ప్రేమకథలు కూడా ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా 2011 వరల్డ్ కప్‌ను క్లైమాక్స్ సన్నివేశంగా పెట్టడంతో సినిమా అదిరిపోయే టైమింగ్‌తో ముగిసి మంచి ఫీల్ ఇచ్చింది.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ధోనీ కెప్టెన్‌గా ఉన్నపుడు వచ్చిన కాంట్రవర్సీలకు చూపించకపోవడం ప్రేక్షకులను నిరాశపర్చింది. ధోనీ వ్యక్తిగత జీవితాన్ని చూపించినంతగా క్రికెట్‌ కెరీర్‌ గురించి చూపించకపోవడం సగటు ప్రేక్షకుడుని నిరాశపరిచింది. ధోనీ కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు? ఆ తర్వాత అతడిపై వచ్చిన వివాదాలను ఎలా ఎదుర్కొన్నాడు? లాంటివి కోరే ప్రేక్షకులకు ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేవడం నిరాశపరచే అంశమే. అలాగే సినిమా మూడు గంటలు ఉండడం.. సెకండాఫ్‌లో వేగంగా సినిమా పూర్తవడం మైనస్‌గా చెప్పొచ్చు.

ms dhoni

సాంకేతిక విభాగం :
దర్శకుడు నీరాజ్‌ పాండే మరోసారి తన స్థాయికి తగ్గట్టుగా సినిమాను మలిచాడు. బాలీవుడ్‌లో తీసిన మూడు సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థాయి తెచ్చుకున్న ఆయన… కోట్లాది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న ధోనీ నిజ జీవిత కథను ఎవ్వరికీ తెలియని కోణంలో చెప్పాలన్న ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ధోనీ కెరీర్ గురించి కాస్త తక్కువ ప్రస్తావించడం విషయంలో మాత్రం నీరజ్ తడబడ్డట్లనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది.

ms-dhoni-movie

తీర్పు :
ఒక ఇండియన్ హీరో కథను తెరపై ఆవిష్కరించడంలో మాత్రం మంచి మార్కులే కొట్టేశాడు దర్శకుడు. ఎంఎస్‌ ధోనీ.. మన జీవితాలున్నంత కాలం ఈ పేరును గుర్తిండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌లో ఇండియాకు తిరుగులేని విజయాలను అందించిన ధోనీకి ఇంత క్రేజీ అంత ఈజీగా వచ్చిందేమి కాదు. ధోనీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతుంది. ఈ సినిమా నిడివి.. ధోనీ కెరీర్‌ గురించి పూర్తిగా లేకపోవడం మినహా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ధోనీ తన ఆటతో గ్రౌండ్‌లో ఎలా కట్టిపడేస్తాడో, ఆ స్థాయిలో కాకపోయినా అతడి కథ కూడా తెరపై కట్టిపడేసేదిగానే ఉంది.

విడుదల తేదీ : 30/09/ 2016
రేటింగ్ : 3/5
నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‍పుత్, దిశా పటాని
సంగీతం : అమాల్ మాలిక్, రోచక్ కోహ్లి
నిర్మాత : అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్
దర్శకత్వం : నీరజ్ పాండే

- Advertisement -