సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 41 శాతం వాటాలున్నట్లు ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకమైనందున, సింగరేణికే వాటిని కేటాయించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రధానమంత్రి నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు గంటసేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
2010 సంవత్సరంలో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) మంజూరు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూతన కంపెనీలు, డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించిందన్నారు. 2014 తర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగలేదని, హైదరాబాద్‌కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలని పీఎంను సీఎం కోరారు.
ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే హైదరాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉందని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీలో కాకుండా మరెక్కడైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామన్నా ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బదులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం సరికాదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
* ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనపర్చుతున్నట్లు మోదీకి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున, ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (PMAY) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇళ్లు మంజూరయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Also Read:మీరే విస్తరించారు..మీరే వాయిదా వేశారు!