మళ్లీ తెరపైకి రిసార్టు రాజకీయాలు..!

203
Resort politics back in Chennai
- Advertisement -

తమిళనాట మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. అమ్మ జయలలిత మరణం తర్వాత గొల్డెన్ బే రిసార్ట్ వేదికగా తమిళ రాజకీయాలు వేడేక్కిన సంగతి తెలిసిందే. శశికళ సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమవ్వడం, పన్నీరు తిరుగుబాటు చేయడం….అన్నాడీఎంకేలో సంక్షోభం ఏర్పడ్డాక తమిళనాడు రాజకీయాలు గోల్డెన్ బే రిసార్ట్ కు మారిపోయాయి. శశికళ తమ వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు వారిని బస్సుల్లో ఎక్కించి రిసార్ట్ కు తరలించింది.

తాజాగా మరోసారి అలాంటి సందర్భమే వచ్చింది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనాన్ని వ్యతిరేకిస్తు చిన్నమ్మ శశికళ వర్గీయులు  తమిళనాడు గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావును కలిశారు. సీఎం పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని.. ఆయనను వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కోరారు. దినకరన్‌తో పాటు 19 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్లాగా మరో ముగ్గురు సైతం పళని స్వామికి వ్యతిరేకంగా గళం విప్పారు. వీరందరిని రిసార్ట్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో మరోసారి తమిళ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

ముఖ్యమంత్రి పళనిస్వామికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదని…అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ప్రతిపక్ష నేత స్టాలిన్  డిమాండ్ చేశారు.  గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లేఖ రాసిన స్టాలిన్  ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 134 మంది. వీరిలో 19 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గానికి చెందిన వారుండగా మరో ముగ్గురు సైతం పళనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ 22 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకోవడంతో.. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సీఎంకు ఉంటుంది. సీఎం పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పళనికి మద్దతు ఇవ్వాలి. లేకపోతే పళని ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -