రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు..రూ. 15 వేల కోట్ల ఆదాయం

125
registrations
- Advertisement -

రిజిస్ట్రేషన్ల ఆదాయం ఊపందుకొంది. గడచిన రెండు వారాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి దాదాపు ₹ 1000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. భూముల ధరల సవరణకు ముందు నాలుగు రోజులు భారీస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాధారణ పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రోజుకు 7 వేల డాక్యుమెంట్లు వస్తే, భూముల ధరల సవరణ నేపథ్యంలో జనవరి చివరి నాలుగు రోజుల్లో ఆ సంఖ్య 10 వేలకు చేరింది. ఆ తరవాత ఫిబ్రవరి మొదటివారంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య కొంత తగ్గినా, క్రమంగా అది మళ్లీ పుంజుకొంది.

ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణా రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ 1998 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది. సెక్షన్ 5 ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, డైరెక్టర్ జనరల్ తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా ఆనాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువలు పెరిగాయి. 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చాయి. కాగా, వ్యవసాయ భూముల్లో సుమారు 50% వరకు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో 35% వరకు పెంపు వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐతే అప్పటికే డాక్యుమెంట్లు అందచేసి ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు కాని వాళ్లకు మాత్రం కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాంటి వాళ్లకు పాత విలువలతోనే రిజిస్ట్రేషన్లు చేయించుకునే వెసులుబాటు కల్పించింది.

ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి కొత్త రేట్ల అమలు నేపథ్యంలో జనవరి నెల చివరి నాలుగురోజులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. సాధారణంగా రోజుకు 7 వేలుగా ఉండే డాక్యుమెంట్లు సంఖ్య 10 వేలకు చేరింది. తదనుగుణంగా రోజుకు ₹ 90 నుంచి ₹ 100 కోట్ల మేర జనవరి 28 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు దాదాపు ₹ 400 కోట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చార్జీల రూపంలో ఖజానాకు చేరింది. ఇక ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్ రేట్ల పెంపు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి నెలలోని మొదటి 10 రోజుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ₹ 600 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే రోజుల్లో అంటే 2021 ఫిబ్రవరి నెల మొదటి 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన రెవెన్యూ ₹ 337 కోట్లుగా ఉంది. ఇక పెంచిన మార్కెట్ వాల్యూల ఆధారంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి నెలకు ₹ 1200 కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుంది. అంటే సంవత్సరానికి ₹ 15 వేల కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.

- Advertisement -