వెయ్యి నోటుని రద్దు చేసి రెండు వేల నోటుని ప్రవేశపెట్టడంతో చిల్లర సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరి ఎక్కువగా ఉండటంతో ప్రజలు చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో చిల్లర కొరతని తీర్చేందుకు కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. ఈ మేరకు బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదలైంది.
ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు సిఫారసు మేరకు రూ.200 నోటును జారీ చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నుండే రూ.200 నోటు చలామణిలోకి వస్తుందని ఆర్బీఐ ప్రకటించింది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు.
పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.
నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోటును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రానున్న ఐదేళ్లలో ఇది ఎప్పుడైనా జరగవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రద్దు చేసేందుకు రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారని, దేశంలో ఐదొందల నోటే అతి పెద్ద నోటుగా చెలామణిలో ఉంటుందన్నారు. కాగా, 2016 నవంబరు 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.