కాంగ్రెస్‌కు రేణుకా గుడ్‌ బై..?

229
renuka
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఆ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారా..త్వరలో కాంగ్రెస్‌ను వీడనున్నారా..?ఇప్పుడు ఇదే టాపిక్‌ ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రేణుకా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అంటిముట్టనట్లే ఉన్నారు. తాజాగా ఖమ్మం ఎంపీ సీటు తనకు కేటాయించకపోతే పార్టీకి గుడ్‌ బై చెబుతానని సంచలన ప్రకటన చేశారు.

ఎంపీ స్ధానాలకు పోటీచేసే వారు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ కోరగా ఖమ్మం ఎంపీ స్ధానానికి పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వి హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదే స్ధానం నుండి బరిలోకి దిగాలని రంగం సిద్ధం చేసుకున్న రేణుకకు పొంగులేటి,వీహెచ్‌ దరఖాస్తు చేసుకోవడం ఆగ్రహం తెప్పించింది.

ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన రేణుకా ఖమ్మం పార్లమెంట్‌ టికెట్‌ తనకు కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు. ఈసారి టికెట్‌ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగ అని ప్రకటించారు.పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, ఎవరికి దరఖాస్తు చేసుకుంటే టికెట్‌ ఇప్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఎవరు తీసుకున్నారని నిలదీశారు.

కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన రేణుకా రాహుల్‌గాంధీ చెప్పింది ఒకటయితే, రాష్ట్రంలో జరుగుతోంది మరొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పదవులు వచ్చినవాళ్లు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. పదవులు వచ్చినంత మాత్రాన కిరీటాలు రావనే విషయాన్ని గుర్తెరగాలని చురకలు అంటించారు.

ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు రేణుకా చౌదరి. ఖమ్మం ఎంపీగా,రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన రేణుకా మన్మోహన్,దేవేగౌడ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్నారు. తాజాగా రేణుకా పార్టీకి రాజీనామా చేస్తారన్న వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -