నేషనల్ హెరాల్డ్ కేసు..సోనియా,రాహుల్‌కు రిలీఫ్

6
- Advertisement -

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు మంగళవారం ఊరటనిచ్చింది. ఈ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాఖలు చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారణ చేపట్టడానికి నిరాకరించింది.

రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జి (పీసీ యాక్ట్) విశాల్ గోగ్నే, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదు చట్టపరంగా నిలవదని స్పష్టం చేశారు. ఈ కేసు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా నమోదు అయిందని, ఎఫ్‌ఐఆర్ (FIR) ఆధారంగా కాదని కోర్టు పేర్కొంది.

షెడ్యూల్ చేసిన నేరానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ లేకుండా, సెక్షన్ 3 కింద నిర్వచించబడిన మరియు సెక్షన్ 4 కింద శిక్షార్హమైన మనీ లాండరింగ్ నేరంపై దర్యాప్తు, అభియోగ పత్రం దాఖలు చేయడం సాధ్యం కాదు” అని కోర్టు వ్యాఖ్యానిస్తూ, గాంధీలపై ఈడీ ఫిర్యాదును కొట్టివేసింది.సోనియా, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దూబే, సామ్ పిత్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మెర్చండైజ్, సునీల్ భండారీని కూడా ఈడీ నిందితులుగా చేర్చింది.

నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను యంగ్ ఇండియన్ అనే సంస్థ మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నదనే ఆరోపణల ఆధారంగా ‘నేరాల ద్వారా వచ్చిన ఆదాయం’ను లాండరింగ్ చేశారని ఈడీ ఆరోపించింది. యంగ్ ఇండియన్‌లో గాంధీలు మెజారిటీ వాటాదారులని ఈడీ తెలిపింది.

అయితే, ఆస్తులను ఉపయోగించడమో, లాభాలుగా మార్చడమో లేకుండానే మనీ లాండరింగ్ ఆరోపణలు చేయడం విచిత్రమని గాంధీలు వాదించారు. యంగ్ ఇండియన్ ద్వారా AJL ఆస్తులను స్వాధీనం చేసుకున్నారన్న ఈడీ ఆరోపణలను వారు ఖండించారు. AJLను అప్పుల నుంచి విముక్తం చేయడానికే ఆ రుణం ఇచ్చామని తెలిపారు.

Also Read:BRSLP సమావేశం 21కి వాయిదా

ఈ నేషనల్ హెరాల్డ్ కేసు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా ప్రారంభమైంది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, సామ్ పిత్రోడా, గాంధీ కుటుంబ నియంత్రణలోని యంగ్ ఇండియన్‌పై మోసం, క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం, ఆస్తుల దుర్వినియోగం ఆరోపణలు చేశారు.

- Advertisement -