వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సిఎం తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….‘‘ ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో వొక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ధరణిద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా వున్నది. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నం. అందుకే కొన్ని రోజులు వేచి చూసినం. నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్పూర్తిగ అభినందిస్తున్న ’’ అని సిఎం అన్నారు.
ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.