విప్లవ నటుడు మాదాల రంగారావు మృతి..

362
- Advertisement -

ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు (69) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎర్ర సూర్యుడు మాదాల రంగారావు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. ఆయన వయస్సు 69 ఏళ్లు. గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవలి వరకు వెంటిలెటర్ పైన ఉన్నారు. మాదాల రంగారావు మృతి పట్ల ఆయన కుమారుడు, నటుడు మాదాల రవి మాట్లాడుతూ.. ‘‘నాన్నగారికి గత ఏడాది గుండెపోటు రావడంతో ఆపరేషన్‌ చేయించాం. అప్పటి నుంచి ఆయన డాక్టర్స్‌ పర్యవేక్షణలో ఉంటున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌లో జాయిన్‌ చేశాం. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈరోజు పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూశారు’’ అన్నారు.

Madala Rangaraoమాదాల రంగారావు పేరు చెప్పగానే ఆయన నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన పలు విప్లవ చిత్రాలు గుర్తుకొస్తాయి. ‘యువతరం కదిలింది’తో మొదలైన మాదాల రంగారావు విప్లవ చిత్రాల ప్రస్థానం.. ఎర్ర పావురాలు సినిమా వరకు సాగింది. ఒంగోలు జిల్లాలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు మాదాల రంగారావు. కమ్యూనిస్టు భావాలతో మమేకమైన కుటుంబం నుంచి వచ్చిన మాదాల.. ప్రజానాట్య మండలితోనూ ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆ అనుబంధంతోనే ఆయనకు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. ఆరంభంలో కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్, విలన్ వేశాలు వేసిన మాదాల.. తర్వాత ‘నవతరం పిక్చర్స్ పతాకం’పై పలు చిత్రాలు నిర్మించి, నటించారు. అన్ని చిత్రాల్లోనూ కమ్యూనిస్టుగా కనిపించారాయన.

Madala Rangarao

మాదాల రంగారావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. అవినీతి, అక్రమాలపై, సామాజిక దురన్యాయాలపై మాదాల సినీ మాధ్యమం ద్వారా పోరాడి ప్రజల హృదయాలను చూరగొన్నారని అన్నారు. అప్పట్లో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్నప్పుడు మాదాల అభ్యుదయ చిత్రాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయని తెలిపారు. రాజకీయ, సామాజిక రంగాల్లో చీకటి కోణాలను తన చిత్రాలలో ఎండగట్టారన్నారు. మాదాల రంగారావు కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. ఫిల్మ్ నగర్ లో అభిమానుల సందర్శనార్థం మాదాల భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

- Advertisement -