ప్లే ఆఫ్‌లోకి వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ సేన అదరగొట్టింది. చిన్నస్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో గెలిచి నిలిచింది. బెంగళూరు విధించిన 219 పరుగల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన్ సన్ రైజర్స్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.
విలియమ్‌సన్ 42 బంతుల్లో 7×4, 5×6 సిక్సర్లతో 81 విరుచుకపడ్డారు. కేన్ పెను విధ్వంసానికి తోడు మనీష్ పాండే (62 నాటౌట్; 38 బంతుల్లో 7×4, 2×6) మెరవడంతో సన్‌రైజర్స్ గెలిచేలా కనిపించింది. ఒకానొక దశలో బెంగళూరు చేతి నుంచి మ్యాచ్ చేజారేలా కనిపించింది. కానీ.. ఆఖరి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో తొలి బంతికే విలియమ్సన్ ఔటవడంతో.. మ్యాచ్ మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది. చివరి బంతి వరకూ క్రీజులో నిలిచిన మనీశ్ పాండే ఒత్తిడికి గురై పేలవ షాట్లు ఆడటంతో సీజన్‌లో హైదరాబాద్ జట్టుకి నాలుగో ఓటమి తప్పలేదు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 5 ఓవర్లకే ఓపెనర్లు పార్థివ్ పటేల్ (1), విరాట్ కోహ్లి (12) వికెట్లను చేజార్చుకుంది. స్కోరు 39. దూకుడు మీదున్న డివిలియర్స్‌కు తోడైన అలీ.. సిక్సర్ల మోత మోగించాడు. 10 ఓవర్లకు బెంగళూరు స్కోరు 84/2. ఆ తర్వాత గేర్ మారింది. అలీ, ఏబీ రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. డివిలియర్స్ 32 రెండు బంతుల్లో అర్ధశతకం సాధించగా.. అలీ 25 బంతుల్లోనే ఆ పని పూర్తి చేశాడు. చివర్లో గ్రాండ్‌హోమ్ (40; 17 బంతుల్లో 1×4, 4×6), సర్ఫ్‌రాజ్ ఖాన్ (22 నాటౌట్; 8 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో 6 వికెట్లు కొల్పోయి 218 పరుగులు చేసింది. ఇప్పటికి ఆరు విజయాలు సాధించిన బెంగళూరు తన ఆఖరి మ్యాచ్‌ను 19న రాజస్థాన్‌తో ఆడాల్సివుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు నిలవాలంటే ఆ మ్యాచ్‌లోనూ నెగ్గాలి.