ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ అద్భుత విజయం..

81
rcb

ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండర్ ప్రతిభకు తోడు కెప్టెన్ కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ సేన 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.

ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ దెబ్బకు ముంబై బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. హార్దిక్ పాండ్యా (3), కీరన్ పొలార్డ్ (7), రాహుల్ చాహర్ (0)లను వరుస బంతుల్లో వెనక్కి పంపి హ్యాట్రిక్ సాధించాడు. ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. హర్షల్ మొత్తంగా నాలుగు వికెట్లు తీసుకోగా, చాహల్ 3, మ్యాక్స్‌వెల్ 2, సిరాజ్ ఓ వికెట్ తీసుకున్నాడు.

ముంబై బ్యాట్స్‌మన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 43 పరుగులు చేయగా, డికాక్ 24 పరుగులు చేశాడు. 9 మంది ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ముంబైకి ఇది ఆరో పరాజయం కాగా, ఆరు విజయాలు సాధించిన కోహ్లీ సేన 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కోహ్లీ 51 (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రీకర్ భరత్ 32 (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ 56 (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.