జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్..

155
- Advertisement -

మానవ మనుగడకు మొక్కలే ప్రాణం హరిత తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరుఊరికో జమ్మి చెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా చొప్పదండి పట్టణ కేంద్రంలో శివ కేశవ ఆలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జమ్మి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ భూమా రెడ్డి, వైస్ చైర్మన్ ఇప్పన పల్లి విజయలక్మి సాంబయ్య, కౌన్సిలర్లు మరియు మండల పార్టీ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఊరికి జమ్మిచెట్టు, ప్రతి గుడికి జమ్మిచెట్టు నాటాలని రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుతో జమ్మి మొక్కను నాటమన్నారు. తదనంతరం జమ్మి చెట్టు ప్రాధాన్యతను తెలుపుతూ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా, ఔషధంగా ఎంతో ప్రాధాన్యం గలది. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. దసరా నాడు సాయంత్రం పక్షులను చూడటానికి గుంపులు గుంపులుగా వెళతారు. ఇదే సందర్భంలో జమ్మి పూజ చేస్తారు. శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ!/ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! అని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత బంధు మిత్రులకు జమ్మి ఆకులు చేతిలో పెట్టి నమస్కరిస్తుంటారు. కొందరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. ఒకరికొకరు పలుకరించుకోని వారు కూడా దసరానాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి నమస్కరించుకొని విభేదాలు మరిచిపోతారు. జమ్మి తెలంగాణ ప్రజల్లో వెల్లివిరిసే సౌహార్దతకు ప్రతీక.

రాముడు లంకపై యుద్ధానికి వెళ్ళే ముందు శమీ వృక్షాన్ని పూజించాడని చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి పెడతారు. తమకు విజయం సిద్ధించాలని జమ్మి చెట్టుకు పూజిస్తుంటారు. పలు రాష్ర్టాలలో జమ్మిని పూజించే సంప్రదాయం ఉన్నది. మైసూరు దసరా ఉత్సవాలలోనూ శమీ వృక్షాన్ని పూజిస్తారు. జమ్మిని దుర్గామాత స్వరూపంగా కూడా భావిస్తారు. ఓమ్ ఇభవక్త్రాయ నమః, శమీ పత్రమ్ సమర్పయామి అంటూ విఘ్నేశ్వరుడికి శమీ పత్రాలను సమర్పిస్తారు. జమ్మిని పూజిస్తే శని పీడ విరగడవుతుందనే నమ్మకం కూడా ఉన్నది. నిప్పును పుట్టించడానికి శ్రేష్టమైనది కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అనేవారు.

జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుంది. ఎంతటి కరువు కాలంలో అయినా తట్టుకొని నిలువడం ఈ చెట్టు ప్రత్యేకత. అందువల్ల ఈ చెట్లు ఉంటే కనీస హామీగా భావిస్తారు. కరువు కాలంలో పశువులకే కాకుండా, మనుషులకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. ఔషధంగా కూడా ఉపయోగకరం. కొన్ని ప్రాంతాలలో ఈ చెట్టు నీడన గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునేవారు. ఈ చెట్టు సగటు ఆయుర్దాయం 120 ఏండ్లు. వేర్లు ముప్ఫై మీటర్ల లోతు వరకు పోతాయి. ఏ మాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాలలో కూడా ఈ చెట్టు తట్టుకుని నిలుస్తుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జమ్మిని జాతీయ వృక్షంగా ప్రకటించారు. అక్కడ జమ్మి చెట్టును కొట్టివేస్తే నేరం. భూమి సారం కొట్టుకొని పోకుండా నిలుపుతుంది కనుక తోటల్లో ఈ చెట్లను నాటుకోవాలని ప్రజలకు పిలుపునిస్తుంది.

బహ్రైన్‌లో దాదాపు 500 ఏండ్ల వయసున్న జమ్మి చెట్టు ఉన్నది. షరాజత్ అల్ హయత్ (జీవన వృక్షం) అనే పేరున్న ఈ చెట్టును చూడటానికి ఏటా దాదాపు 65 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. 9.75 మీటర్ల ఎత్తున ఈ చెట్టు వేర్లు సుమారు యాభై మీటర్ల లోతు వరకు ఉన్నాయి. 2009లో ఈ చెట్టును ప్రపంచ ఏడు కొత్త ప్రకృతి వింతల జాబితాలో చేర్చారు. అరేబియా ఏడారిలో ఏ మాత్రం తేమ లేని నేలలో ఇది వేళ్ళూనుకొని పెరగడం ఒక పెద్ద వింత. చుట్టూరా ఒక నీటి చుక్క ఉండదు, ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. అయినా ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టుకు నీరు ఎలా వస్తుందనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం. జమ్మిచెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలు నాటుదాం. మన పిల్లలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దాం అన్నారు.

- Advertisement -