నల్లకుబేరుల ఆటకట్టించేందుకు కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. పెద్దనోట్ల రద్దు అనంతరం జన్‌ధన్ ఖాతాల్లో పోగుపడిన మొత్తాలపై కేంద్రం దృష్టి సారించింది. రైతులు, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల పేరిట తెరిచిన ఖాతాలను ఉపయోగించుకుని నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్న వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంది. జన్‌ధన్ యోజన ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై పరిమితి విధిస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాలు జారీచేసింది. కేవైసీ పత్రాలు సమర్పించిన వారు నెలకు రూ.10వేలు, పత్రాలు సమర్పించని వారు రూ.5వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చని ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువరించింది.
ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతా ఉండాలన్న ఉద్దేశంతో 2014లో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలను తెరిచారు. అయితే నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఈ ఖాతాల్లో పెద్దమొత్తాల్లో నగదు జమ అవుతూ వస్తోంది. కొందరు అక్రమార్కులు మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వారి ఖాతాల్లో నల్లధనాన్ని వేసి తెల్లగా మార్చుకుంటున్నారని కేంద్రం గ్రహించింది.
ఇటీవల ఇదే విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన 14 రోజుల్లోనే ఈ ఖాతాల్లో రూ. 27,200 కోట్ల మేర నగదు జమ అవడం గమనార్హం. దీంతో కేంద్రం జన్‌ధన్ ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే పరిమితికి మించి జన్‌ధన్ ఖాతాలో డిపాజిట్ చేసిన..డబ్బుకు ఆధారాలు కూడా చూపాల్సిందిగా..ఆదేశాలు జారీ చేసింది.