ఉపాధి పనులు కావాలా.. దరఖాస్తు చేసుకోండి..!

261
- Advertisement -

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నగరం నుండి పల్లెలకు వచ్చిన కూలీలకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం క్రింద ఉపాధి పనులు కల్పించాలని రంగారెడ్డి జిల్లా పాలనా యంత్రాగం నిర్ణయించింది. ఉపాది అవకాశాలకు గ్రామాలనుండి హైదరాబాద్ తోపాటు దేశంలోని పలునగరాలకు పెద్ద సంఖ్యలో గ్రామీణ కూలీలు వెళ్లారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి గాను దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించడంతో నగరాలకు వెళ్లిన గ్రామీణులు తిరిగి తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. గ్రామాలకు తిరిగి వచ్చిన వారికి కూడా జాతీయ ఉపాధిహామీ పధకం క్రింద ఉపాధిని కల్పించనున్నట్టు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలియచేసారు.

గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఉపాధి కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధిని కల్పించనున్నామని జైన్ తెలిపారు. గ్రామల్లో ఇప్పటికి జాబ్ కార్డు లేనివారందరూ కొత్తగా జాబ్ కార్డుల కోసం దారకాస్తుచేసుకోవాలని స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనుల పురోగతి పై జిల్లా పరిషత్ సి.ఈ.ఓ, డీఆర్డీఏ పీడీ, డీపీవో, ఇంజనీర్లతో అడిషనల్ కలెక్టర్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 139926 మందికి జాబ్ కార్డులు ఇవ్వగా 351712 మంది కూలీలున్నారని తెలిపారు.ప్రస్తుత సంవత్సరంలో కొత్తగా 563 మందికి జాబ్ కార్డులను అందచేశామని చెప్పారు. జిల్లాలో 560 గ్రామపంచాయితీలకుగాను 484 గ్రామాల్లో 58414 మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారని తెలియచేసారు. గ్రామాల్లో ఏ ఒక్కరు కూడా ఉపాధి లేకుండా ఉండొద్దని అందరికీ ఉపాధికల్పించాలని స్పష్టంచేశారు. అవసరమైనవాళ్ళందరూ జాబ్ కార్డులకోసం వెంటనే దరకాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు.

- Advertisement -