రివ్యూ :రంగరంగ వైభవంగా

105
ranga ranga
- Advertisement -

పంజా వైష్ణవ్‌ ఉప్పెన, కొండపొలం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో మంచి మార్కులు వేయించుకున్నారు. కానీ ఈసారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ తీసిన గిరీశాయ డైరెక్షన్‌లో ‘రంగరంగ వైభవంగా’ సినిమాలో నటించాడు. ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథేమిటంటే..
రిషి (వైష్ణవ్), రాధ (కేతిక) చిన్నప్పటి నుంచీ పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. అయితే స్కూల్ డేస్‌లోనే ఇద్దరి మధ్య చిన్న గొడవ రావడంతో మాట్లాడుకోవడం మానేస్తారు. ఒకరిపై ఒకరికి ఎంతో ఇష్టమున్నా తరచూ గిల్లికజ్జాలాడుకుంటూనే ఉంటారు. కానీ ఓ సందర్భంలో ఇద్దరూ మాట్లాడుకుంటారు. ప్రేమను వెలిబుచ్చుకుంటారు. కానీ ఇద్దరూ ఒక్కటయ్యే సమయానికి రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఫ్యామిలీస్ విడిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది, ఇద్దరూ ఎలా కలిశారు, వారి కుటుంబాలను ఎవరు, ఎలా కలిపారు అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..
రిషి, రాధ ఇద్దరి కుటుంబాలు  కలిసి ఉంటాయి. వాటిలోని పిల్లలు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత గొడవలొస్తాయి. వీళ్లు విడిపోతారు. కలవడానికి తపన పడతారు. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఇలాంటి కథ, కథనాలతో వచ్చిన చాలా సినిమాలు ఇప్పటికే చూసేశారు. అయినా కూడా ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడమంటే సాహసమనే చెప్పాలి. పోనీ పాత కథయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తే ఓకే. కానీ ఫస్ట్ సీన్ నుంచి కూడా రొటీన్‌గా మొదలైతే ఇక చివరికి వచ్చేసరికి ప్రేక్షకుడి పరిస్థితి ఏమవుతుందో వేరే చెప్పాలా. భూతద్దం పెట్టి వెతికినా ఒక్కటంటే ఒక్కటి కొత్త సీన్ లేదు ఇందులో. ఓ చిన్న ఇగో క్లాష్‌ని అడ్డు పెట్టుకుని కథంతా నడిపేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో, దాన్ని రెండున్నర గంటలసేపు చూపించి ఎలా కూర్చోబెట్టగలమనుకున్నారో వారికే తెలియాలి. కనీసం చిలిపి తగాదాలు, చక్కని రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఎక్కువగా లేవు. రైటింగే వీక్‌గా ఉన్నప్పుడు ఇక టేకింగ్ గురించి మాట్లాడుకుని ఏం ఉపయోగం! ఓ టైమ్‌లో హీరో హీరోయిన్లిద్దరూ తమ తండ్రుల్ని కలపాలనుకుంటారు. ఒకరి ఫోన్ నుంచి ఒకరికి సినిమాకి రమ్మంటూ సీక్రెట్‌గా మెసేజ్ చేసేస్తారు. అది కూడా ఏ సినిమాకి.. ‘యమగోల’ సినిమాకి. వాళ్లు సినిమాకి వచ్చేస్తారు. ఓలమ్మీ తిక్క రేగిందా పాట మొదలవుతుంది. అంతే.. ఇద్దరి ఫాదర్స్ లేచి డ్యాన్సులు వేసేస్తారు. అది చూసి వాళ్లు కలిసిపోయినందుకు వీళ్లిద్దరూ తెగ పొంగిపోతారు. అందమైన సీన్లు లేవు. బలమైన ఎమోషన్స్ లేవు. అందమైన రొమాన్స్ కూడా లేదు. ఏం ఉందని ఈ సినిమా చూడాలో అర్థం కాదు. ఏం ఉంది అని అడిగితే సినిమా చూసిన ప్రేక్షకుడు చెప్పడానికి కూడా ఏమీ లేదు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే..

మ్యూజిక్ బాగుంది. పాటలు మరీ బ్యాడ్‌గా అయితే లేవు. బీజీఎం కూడా జోష్‌ని పెంచేలానే ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. అయితే తన స్థాయికి తక్కువనే చెప్పాలి. మంచి సీన్స్ ఉంటే మంచి మ్యూజిక్ కూడా వచ్చేదేమో. కాబట్టి దేవిని తప్పుబట్టడానికి కూడా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ బానే ఉంది. ప్రతి ఫ్రేమ్ కలర్‌‌ఫుల్‌గా అనిపించింది. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పనిచెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. అర్జున్‌ రెడ్డిని తమిళంలో రీమేక్‌ చేసిన దర్శకుడు గిరీశాయ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ‘రంగ రంగ వైభవంగా’ తెరకెక్కించారు. కాకపోతే కథ, కథనాలు చాలా బలహీనంగా ఉండటం వల్ల మిగతావేమీ ప్రేక్షకుడు ఆస్వాదించలేరు. ఆ విషయంలో దర్శకుడు చాలా మైనస్‌లను మూటగట్టుకున్నాడు. ఒక సినిమా చూసినప్పుడు రకరకాల సినిమాలు గుర్తొస్తుంటే ఇక ఆడియెన్స్ ఆ సినిమాని ఎలా ఇష్టపడగలరు! ఈ మూవీ విషయంలో అదే జరిగింది. ప్రారంభం నుంచి చివరి వరకు ఏమాత్రం ఫ్రెష్‌ ఫీల్ లేని ఈ సినిమాతో సక్సెస్‌ని ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశే అవుతుంది. మొత్తంగా ఇదొక రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు.

ఎవరెలా చేశారంటే..
తొలి రెండు చిత్రాల్లోనూ పర్‌‌ఫార్మెన్స్ ఫుల్ స్కోప్ ఉన్న పాత్రలు చేశాడు వైష్ణవ్. జోవియల్‌గా, చలాకీగా ఉండే పాత్ర. దాంతో అందులో అతను ఫిట్ కాలేదేమో అనిపిస్తుంది. హుషారుగా కనిపించాలని అతనెంత ట్రై చేసినా ఎక్కడో ఏదో తగ్గిన ఫీల్ కలుగుతుంది. సీరియస్ సీన్స్ మాత్రం ఎప్పటిలానే బానే చేశాడు. బేసిగ్గా అతనికి సీరియస్ రోల్స్ సూటవుతాయని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. కేతిక చూడటానికి బాగుంది. అయితే పర్‌‌ఫార్మెన్స్ పరంగా కాస్త ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది. కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ పాత్ర ఏదైనా ఉంది అంటే అది నవీన్ చంద్రదే. తన పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే ఇంతకంటే బలమైన పాత్రలు గతంలో చాలానే చేశాడు కనుక ఇది అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. ప్రభు, నరేష్‌లతో పాటు మిగతా వాళ్లందరికీ పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.

టైటిల్‌ : రంగరంగ వైభవంగా
నటీనటులు : వైష్ణవ్‌ తేజ్, కేతికా శర్మ, ప్రభు, నరేశ్‌ అలీ, సుబ్బరాజు, సత్య తదితరులు
నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
దర్శకత్వం: గిరీశాయ
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: శామ్‌ దత్‌
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర్‌ రావు
విడుదల తేది: సెప్టెంబర్‌ 2, 2022
రేటింగ్‌ 2.5/5

- Advertisement -