దివంగత లెజండరీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమా షూటింగ్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించగా శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ఎన్టీఆర్ బాల్యం నుంచి సినీ రంగంలోకి ఎంట్రీ, టీడీపీని స్ధాపించడం వంటికి చూపించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జీవితంలో కీలకపాత్ర పోషించిన వారి ఎంపిక జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే మాములు విషయం కాదు. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహామనిషి. అందుకే కత్తిమీద సాము లాంటి ఈ బయోపిక్‌లో నటీనటుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య 64 గెటప్స్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఏఎన్నాఆర్‌గా నాగ్ నటించనున్నారని వార్తలు వెలువడుతుండగా ఎన్టీఆర్ అల్లుడు, బాలయ్యకు వియ్యంకుడు, సీఎం అయిన చంద్రబాబు పాత్రలో దగ్గుపాటి రానా కనిపిస్తాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ నెల 28న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రానా నటించే పాత్రపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా సమాచారం.
ఇక ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ అర్దాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ అంటే భారీ అంచనాలు ఉంటాయని వాటిని తాను అందుకోవడం కష్టమని తేజ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాఘవేంద్రరావు,క్రిష్,కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు వినిపించిన ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.