పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకుని, ప్రొడ్యూసర్ సురేష్ బాబుకి మంచి లాభాలు తెచ్పిపెట్టాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఒక స్టార్ ప్రొడ్యూసర్ ని మెప్పించాడు తరుణ్. పెళ్లి చూపులు చిన్న సినిమానే అయినా… కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఈ సినిమా హిట్ తో తరుణ్ బాస్కర్ ని మరో మూడు సినిమాలు తన ప్రొడక్షన్ లోనే చేయాలని సురేష్ బాబు కోరగా, తరుణ్ వెంటనే ఒప్పేసుకున్నాడు.
తాజాగా తరుణ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో మొదటి సినమా ఇది. ఒప్పందం ప్రకారం ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించాడు. ఈ సినిమా ఔట్ పుట్ కూడా ఆయనకు బాగా నచ్చేసిందట. ఈ సినిమా 29న ప్రేక్షకులు ముందుకురానుంది. ఇక తన రెండవ సినిమాను సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో చేయాలనుకున్నా.. కొన్ని కారణాల వలన కుదరలేదు.
మూడవ సినిమాను మాత్రం రానాతో చేయాలని ఫిక్స్ అయ్యాడట తరుణ్. ఇందుకు రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్. కానీ రానా ప్రస్తుతం ‘హాథీ మేరి సాథీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కోడి రామ్మూర్తి పంతులు బయోపిక్ లో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన వెంటే తరుణ్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడట రానా.