ఆర్.కే స్టూడియోస్ బ్యానర్ లో ‘గుంటూరు టాకీస్’ సినిమా తర్వాత వచ్చిన రెండో చిత్రం ‘రాజా మీరు కేక’. ఈ బ్యానర్‌తో కాస్తా సామాజిక కోణంలో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని కాస్త వినోదాత్మకంగా చెప్పాలని ప్రయత్నం చేశారు. కొత్త దర్శకుడు కృష్ణ కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ:
రవి(రేవంత్), శ్వేత(లాస్య), శ్రీను(హేమంత్), నోయెల్ నలుగురు స్నేహితులు. రవి, శ్వేత ఇద్దరూ ట్రూ టెక్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటారు. ఆ కంపెనీ సీఈవో నాగరాజు(తారకరత్న) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటాడు. దాని కోసం అతడి కంపెనీ ద్వారా వచ్చిన మొత్తం డబ్బుని రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. శ్రీను, నోయల్ లు తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బుతో ట్రూ టెక్ కంపనీ షేర్స్ కొంటారు.
అయితే నష్టాల కారణంగా ట్రూ టెక్ కంపనీ మూతపడుతుంది. దీని వల్ల అందకి ఉద్యోగులతో పాటు శ్వేత, రవిలకు ఉద్యోగం పోతుంది. షేర్ మార్కెట్ లో డబ్బులు వస్తాయనే ఆశతో ట్రూటెక్ షేర్స్ మీద 10 లక్షలు పెట్టుబడి పెట్టిన శశాంక్, శ్రీనుల సొమ్ము మొత్తం పోతుంది. దీంతో ఒక్కసారి అందరు సమస్యల్లో చిక్కుకుంటారు. అలా తమ జీవితాలు రోడ్డున పడటానికి కారణం అయిన నాగరాజు మీద ఆ నలుగురు ఎలా పగ తీర్చుకున్నారు? ట్రూటెక్ కంపెనీ వెనుక ఉన్న స్కామ్ ని ఎలా బయట పెట్టారు? ఆ స్కామ్ ఏమిటి ? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
విలువలతో పెరిగిన కుర్రాళ్ళు ఎలాంటి పరిస్థితులనైనా.. ఎదుర్కొంటారనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను చిత్రీకరించారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎప్పుడు మూతపడుతున్నాయో.. అర్థం కానీ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. ఆ నేపధ్యంలో సినిమాను నడిపించారు. అయితే ఈ సినిమాకి ప్రధాన బలం అంటే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ఎంచుకున్న కథ. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసిన సత్యం కంప్యూటర్స్ స్కామ్ ని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకొని అసలు ఆ స్కామ్ వెనుక ఏం జరిగి ఉండొచ్చు అనే విషయాన్ని దర్శకుడు తన కోణంలో చెప్పాలనుకున్న విషయం నిజంగా అభినందనీయం. నటీనటులుగా చేసిన రేవంత్, లాస్య, నోయల్, ఆర్జే హేమంత్, తారకరత్న ఉన్నంతలో కథకి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. హీరోయిన్ సరయు తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే అక్కడక్కడ మధ్యతరగతి జీవితాలని పరిచయం చేస్తూ రాసిన సంభాషణలు కొంచెం ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు అనుకున్న పాయింట్ ఏ మాత్రం గొప్పగా లేదు. దాన్ని తెరపై ఆయన మలిచిన తీరు ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, కొన్ని రొటీన్ సన్నివేశాలతో నడిపించేశాడు. పోనీ సెకండ్ హాఫ్ ఏమైనా.. ఆసక్తికరంగా ఉంటుందా..? అంటే పొరపాటే. కథ, కథనాలు ఆసక్తికరంగా లేకపోవడం, మరింత పేలవంగా వాటిని తెరపై చూపించడం విసుగు పుట్టిస్తుంది.
ఇక సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కథ మంచిదే అయిన దానిని తెరకెక్కించే విధానంలో అడుగడుగునా తడబాటు కనిపిస్తుంది. ఏదో ఉన్న బడ్జెట్ లో సినిమా చుట్టేయాలనే ఆలోచనతో అసలు గొప్పగా చూపించాల్సిన సన్నివేశాలు కూడా పస లేకుండా చేసేశారు. చివరికి దర్శకుడు తాను ఎంచుకున్న కథతో చెప్పాలనుకున్న పాయింట్ ను కాస్త వదిలేసి ఇంకేదో చెప్పి, దాన్ని ఎలా ముగించాలో తెలియక అసందర్భంగా ముగించేసిన ఫీలింగ్ కలుగింది. ఇక సినిమాలో పోసాని కృష్ణ మురళీ, పృద్వీ, నల్ల వేణు వంటి మంచి నటుల్ని పెట్టుకొని కూడా వారిని దర్శకుడు వాళ్ళను సరిగా ఉపయోగించుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో అడుగడుగునా లోపాలు కనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
దర్శకుడు కథ రచయితగా ఒకే అనిపించుకున్న స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణల విషయంలో పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ రామ్.పి.రెడ్డి కెమెరా పనితనం చాలా వీక్ గా కనిపించింది. కెమెరా పనితనం చాలా సాదాసీదాగా ఓ లఘుచిత్రం స్థాయిలో ఉంది. శ్రీ చరణ్ అందించిన సంగీతం పాటల వరకు ఓకే అనిపించుకున్నా, కథని నడిపించే నేపధ్యం సంగీతంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఏ.వి. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఉపయోగపడే స్థాయిలో లేదు. ‘గుంటూరు టాకీస్’ సినిమా తీసిన ఆర్కే స్టూడియోస్ ప్రొడక్షన్ వేల్యూస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. కాస్త ఖర్చు పెట్టాల్సిన సన్నివేశాలని కూడా బడ్జెట్ పరిమితుల వలన దర్శకుడు ఏదోలా తీసేసిన ఫీలింగ్ కలుగుతుంది.
తీర్పు:
రేవంత్ హావభావాల్లో, నటనలో మరింత ఇంప్రూవ్ కావాలి. నోయెల్, లాస్య తమ పాత్రల పరిధుల్లో ఓకే అనిపించారు. హేమంత్ తన ఫన్నీ క్యారెక్టర్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. తారకరత్న పాత్ర ఏమంత బలంగా రాసుకోలేదు. పోసాని పాత్ర కూడా చెప్పుకునేంత లేదు. సినిమాలో కొన్ని చోట్ల కామెడీ వర్కవుట్ అయింది. స్నేహం, కుటుంబ నేపధ్య సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తే బావుండేది. డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను నేరుగా చెప్పకుండా చాలాసేపు సినిమాను సాగదీశాడు. దర్శకుడిగా కృష్ణ కిషోర్ ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
విడుదల తేదీ:16/06/2017
రేటింగ్ : 2.25/5
నటీనటులు: తారక రత్న, లాస్య, రేవంత్,నోయెల్ సేన్,
సంగీతం: శ్రీ చరణ్
నిర్మాణం: ఎమ్. రాజ్ కుమార్
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: కృష్ణ కిశోర్