ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నిరసనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అరాచకాన్ని సృష్టించి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాల తరహాలో భారత్‌లోనూ అధికార మార్పిడికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. శుక్రవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యువత శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాల్సిన రాజకీయ పార్టీలు.. వారిని రాజకీయ ఘర్షణలకు, గందరగోళానికి సాధనాలుగా మార్చుకుంటున్నాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి దేశంలో అశాంతిని సృష్టించడమే ప్రతిపక్షాల లక్ష్యమని ఆరోపించారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉపయోగిస్తున్న ‘ప్రభుత్వ మార్పు’ వంటి పదాలు వారి అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. వారి పోరాటం ఎన్నికల సంస్కరణల కోసం కాదని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగానూ కాదని వ్యాఖ్యానించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి లక్ష్యమని ఆరోపించారు.
రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువులను చేయడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు, సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు, రాజకీయ అవకాశవాదంతో దేశ అభివృద్ధి ప్రయాణాన్ని అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల తీర్పును గౌరవించాలని, తన రాజకీయ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
Also Read:రేవంత్ , భట్టి..రాజీనామా చేయరా?

