రేవంత్ , భట్టి..రాజీనామా చేయరా?

1
- Advertisement -

రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎందుకు రాజీనామా చేయరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. ఓట్లు మాయమయ్యాయని ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నవారు, బొగ్గు వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన నేతల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.

13 కోట్ల ఓట్లు మాయమైతే జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని అంటున్నారని, మరి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయరా అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికారులపై చర్యలు తీసుకోవడం ఏమిటని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో మంత్రి వర్గం, కాంగ్రెస్ నేతలు కేటీఆర్ జుట్టు గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బొచ్చు గురించి మాట్లాడేవారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు సంబంధించిన సమస్యలు, కరువు పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించకుండా కేటీఆర్ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం ఎందుకని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

బొగ్గు వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బాధ్యత వహించాల్సిన వారు సమాధానం చెప్పాలని దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధం కావాలని, వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి పాలనపై దృష్టి సారించాలని సూచించారు.

Also Read:ఢిల్లీ నిరసనలు..అరెస్టులపై పిటిషన్లు

- Advertisement -