తెలంగాణ ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా నిలవడానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న ఈ పెట్టుబడి సాయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది రైతులకు రైతు బంధు చెక్కులు అందాయి. కొన్నిచోట్ల ఇంకా రైతులకు చెక్కులను అందిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల దంపతులు రైతు బంధు చెక్కును అందుకున్నారు.
సుమ కనకాల దంపతులకు మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలంలోని హేమాజీపూర్ శివారులో వ్యవసాయ పొలం ఉంది. ప్రభుత్వం అందిస్తోన్న పెట్టుబడి సాయంలో భాగంగా వారు చెక్కును తీసుకోవడానికి హేమాజీపూర్‌కు చేరుకుని చెక్కును స్వీకరించారు. అయితే తాము ఆర్ధికంగా స్థిరపడినందున తమ చెక్కును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నామని, తమకు చెందే డబ్బులను రైతుల సంక్షేమానికి ఉపయోగించేందుకు ప్రభుత్వానికి తిరిగి తమ చెక్కును తహసిల్దార్ రాంబాయికి అందజేశారు.
అంతకు ముందు సుమ, రాజీవ్ దంపతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వీరు గతంలో ఈ పాఠశాలకు తమ స్వంత డబ్బులతో ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్‌లను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం కంప్యూటర్ విద్యను చదువుకోవాలనే ఉద్దేశ్యంతో లక్ష రూపాయల వ్యయంతో పాఠశాలకు ల్యాప్ టాప్ లను అందజేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత విద్యకు గురుకుల పాఠశాలల్లో లక్షల రూపాయలు వెచ్చించి వారికి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కార్పొరేట్ స్కూల్లలో చేరి డబ్బును వృధా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను చదువుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు రాజీవ్ దంపతులు సూచించారు.