సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తలు ఇప్పుడు తమిళనాట ఇప్పుడు హాట్ టాప్ గా మారాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సంగతేమో కానీ.. ఆ పేరిట జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. రజినీ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రజినీని టార్గెట్ చేసి, విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాయి.
అయితే..రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో… రజనీ రాజకీయాల్లోకి ఖచ్చితంగా రావాలని.. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రజినీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్నట్టు చెప్తూ.. రజనీ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్ ఇటీవలే బెంగళూరులో వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.
ఇదిలా ఉండగా రజనీకాంత్‌పై భాజపా ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. ‘రజనీ నిరక్షరాస్యుడు. ఆయన రాజకీయాలకు సరిపోరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో రజనీకి తెలియదు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే హానికరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రాజకీయాల్లో రావద్దనే నేను ఆయనకు సలహా ఇస్తా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో మరోసారి అభిమానులతో సమావేశమై రాజకీయ రంగ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకుంటా. అప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతా’ అంటూ ఇటీవల రజనీకాంత్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత నెలలో రజనీ అభిమానులతో సమావేశమైన సమయంలోను స్వామి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
‘తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రజనీకాంత్ సరిపోరు. ఆయనకు రాజకీయాల్లో భవిష్యత్తు లేదు. తమిళనాడులో ప్రస్తుత తరం ఎంతో చదువుకున్న వాళ్లు. వాళ్లందరూ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. అందుకే ఆయన సీఎంగా సరిపోరు’ అంటూ స్వామి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. మొత్తానికి రజినీ పొలిటికల్ ఎంట్రీ గురించి మాత్రం తమిళ రాజకీయాల్లో.. రోజుకో హాట్ న్యూస్ బయటకొస్తూనే ఉంది.