సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి చిక్కులు ఎదురవుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో ‘2.0’ చిత్రం తర్వాత రజనీకాంత్ కబాలి దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.మరి ఈ సినిమా మొదలవ్వక ముందే వివాదాల్లో పడింది. పెద్ద హీరోల సినిమాల వెంటే వివాదాలు నడిచొస్తుంటాయి.ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకైతే ఈ బెడద మరీ ఎక్కువ. లింగా,కబాలి సినిమాల విషయంలోనూ ఆయన అనవసర వివాదాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రజినీ కొత్త సినిమా ఇంకా మొదలవ్వకముందే వివాదాల్లో చిక్కుకోవడం విశేషం. తమిళనాడుకు చెందిన ముంబయి అండర్‌వరల్డ్ డాన్ హాజి మస్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ చిత్రంలో మస్తాన్‌ను స్మగ్లర్, డాన్‌గా చూపించొద్దని ఆయన దత్తత కుమారుడు సుందర్ శేఖర్ రజనీకాంత్‌కు లీగల్ నోటిసులు పంపించారు.
‘ప్రముఖ రాజకీయ నాయకుడు, నా గాడ్‌ఫాదర్‌ను స్మగ్లర్, డాన్‌గా చూపించడం ఆమోదనీయం కాదు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను’ అని సుందర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. తన తండ్రి ఎప్పుడూ దోషిగా తేలలేదని, ఇప్పుడు డాన్‌లా చూపిస్తే.. తన పరువుకు భంగం కలిగించినట్లేనని సుందర్ తెలిపారు. మస్తాన్ వెనుక పెద్ద రాజకీయ బృందం ఉందని.. ఆయనను సినిమాలో డాన్‌గా చూపిస్తే చిత్రంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మస్తాన్ నిజజీవితం గురించి తానే అన్ని విషయాలు చెబుతానని.. కావాలంటే తానే నిర్మాతగా చేస్తానని చెప్పారు.
కాని ఈ ప్రచారాన్ని రంజిత్ ఖండించినప్పటికీ.. హాజీ మస్తాన్ దత్త పుత్రుడు తేలిగ్గా తీసుకోవట్లేదు. సినిమా పేరుతో తన తండ్రి జీవిత చరిత్రతో ఆడుకుంటే ఊరుకునేది లేదంటూ రజనీకాంత్ కు హాజీ మస్తాన్ దత్తపుత్రుడు హెచ్చరిక జారీ చేశాడు. మరి చిత్ర బృందం ఈ నోటీసులకు ఎలా స్పందిస్తుందో చూడాలి. మామూలుగా రజినీ వివాదాలంటే భయపడతాడు. జాగ్రత్తలు పాటిస్తాడు. మరి నిజంగానే హాజీ మస్తాన్ స్ఫూర్తితో కథను అల్లుకుని ఉంటే మార్పులేమైనా చేస్తారేమో చూడాలి. రజినీ అల్లుడు ధనుష్ నిర్మించనున్న ఈ సినిమాలో విద్యా బాలన్ రజినీకి జోడీగా నటించనుంది. ‘కబాలి’ తరహాలోనే వేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి రంజిత్ ప్లాన్ రెడీ చేశాడు.
తమిళ ముస్లిం కుటుంబానికి చెందిన హజి మస్తానీ మీర్జా తన ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో కలిసి ముంబయికి వలసవెళ్లారు. అక్కడ గ్యాంగ్‌స్టర్ కరీమ్లాలా, వరదరాజన్‌తో కలిసి పనిచేశారు. రియల్ ఎస్టేట్ బిజినెస్మాన్గానే గాక, ఫిల్మ్ ఫైనాన్షియర్‌గా, స్మగ్లర్‌గా ఎదిగి అండర్‌వరల్డ్ డాన్‌గా స్థిరపడినట్లు సమాచారం. అయితే కొంతకాలం రాజకీయాల్లో కూడా మస్తాన్ పనిచేసినట్లు తెలుస్తోంది.