కొంచెం టైమివ్వండి..!

116
Rajinikanth cancels meeting with fans
Rajinikanth cancels meeting with fans

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై రాష్ట్రంలో మరోసారి దుమారం రేగింది. అనివార్య కారణాల వల్ల అభిమానులతో సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు సూపర్ స్టార్ రజనీ ప్రకటించారు. తన రాజకీయ కార్యచరణ ఏంటన్నది తెలిపేందుకు చెన్నైలో ఈ నెల 12 నుంచి 16 తేదీల మధ్య రాఘవేంద్ర కళ్యాణ మండపంలో సమావేశాలు నిర్వహించాలని భావించారు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదంటూ ఆయన సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. కార్యక్రమానికి ఎక్కువమంది అభిమానులు హాజరవుతారు. ప్రతీ ఒక్కరూ తమ అభిమాన నటుడుతో ఫొటోలు దిగాలని ఆరాటపడతారు. అది చాలా కష్టం అందుకే సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి జిల్లాలో అభిమానులతో సమావేశమవుతానని ఆయన తెలిపారు. అప్పుడు అభిమానులు ఒక్కొక్కరూ ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ విషయాన్ని అభిమానులందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ.. రజనీకాంత్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మరోవైపు తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జయలలిత మృతితో ఖాళీ ఏర్పడ్డ ఆర్కే ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 12న జరగనుంది. అయితే అదేరోజు ప్రారంభం కానున్న సమావేశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. అవి రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అనివార్య కారణాలతో రజనీ తన సమావేశాలను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ 2న అభిమానులతో తొలిసారి సమావేశం అవ్వాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు.