సైబర్ నేరాల దర్యాప్తు పేరుతో సాధారణ పౌరులు మరియు వ్యాపారుల బ్యాంక్ ఖాతాలను ఏకపక్షంగా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా పూర్తిగా స్తంభింపజేయడం పై రాజస్థాన్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో ఖాతాలోని మొత్తం నగదును లేదా పూర్తి ఖాతాను స్తంభింపజేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది.
సైబర్ నేరంలో భాగమైనదిగా భావిస్తున్న నిర్దిష్ట రకం లేదా లెక్కింపు ఉన్న నగదు మొత్తాన్ని మాత్రమే స్తంభింపజేయాలని ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌ను లేదా ఖాతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకూడదని పోలీసులకు మరియు బ్యాంకులకు స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాను నిలిపివేసే ముందు లేదా నిలిపివేసిన వెంటనే సదరు ఖాతాదారునికి చట్టబద్ధమైన నోటీసు అందించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది.
ఖాతాలను ఏకపక్షంగా సీజ్ చేయడం వల్ల ఏ పాపమూ ఎరుగని వ్యాపారులు, సామాన్య పౌరులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇది వారి జీవనోపాధి హక్కును దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసుల నుండి ఉత్తర్వులు రాగానే బ్యాంకులు గుడ్డిగా ఖాతాలను పూర్తిగా నిలిపివేయకుండా, వివాదాస్పదమైన మొత్తాన్ని మాత్రమే హోల్డ్‌లో ఉంచి మిగిలిన నగదును లావాదేవీలకు అనుమతించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read:ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’
సైబర్ నేరాల బాధితులకు న్యాయం చేయడం ఎంత ముఖ్యమో, దర్యాప్తు పేరుతో నిర్దోషులైన పౌరులు ఇబ్బంది పడకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని రాజస్థాన్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

