మాస్ మహా రాజా రవితేజ చివరి సినిమా ‘బెంగాల్ టైగర్’ విడుదలై 20 నెలలు దాటిపోయింది. రవితేజ సినిమా ఫస్ట్ లుక్.. టీజర్.. లాంటి విశేషాలు విని రెండేళ్లవుతోంది. ఐతే ఎట్టకేలకు రవితేజ సినిమాకు సంబంధించి ఇలాంటి విశేషం ఒకటి వార్తల్లో నిలవబోతోంది. మాస్ మహా రాజా కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్’ ఫస్ట్ టీజర్ లాంచ్ కు ముహూర్తం కుదిరింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న దీని టీజర్ విడుదల కాబోతోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. ఈ చిత్రాన్ని అక్టోబరు 12న విడుదల చేయాలనుకుంటున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేయడంతో ముందుగా టీజర్ తో పలకరించబోతున్నారు.రవితేజ ఇందులో అంధుడి పాత్ర పోషిస్తుండటం విశేషం. ఐతే అంధుడి పాత్ర అయినప్పటికీ సినిమా అంతా వినోదాత్మకంగా ఉంటుందంటున్నాడు దర్శకుడు అనిల్. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ మెహ్రీన్ ఇందులో రవితేజకు జోడీగా నటిస్తోంది.