దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు ఆ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. 2014 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న హస్తం పార్టీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 2009 ఎన్నికల్లో 206 సీట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. 2014 ఎన్నికల్లో మాత్రం కేవలం 44 సీట్లకే పరిమితం అయింది. కాంగ్రెస్ ఇంత దారుణంగా పతనం అవ్వడానికి చాలానే కారణాలు ఉన్నాయి. యూపీఏ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడడం. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తటస్థ నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన.. ఇలా చాలా కారణాలు కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపాయి.
అదే టైమ్ లో మోడీ పేరు దేశ వ్యాప్తంగా వినిపించడంతో బీజేపీ బలం పెంచుకొని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ తిరుగులేని విజయం సాధించింది కాషాయపార్టీ. అప్పుడు కింద పడిన కాంగ్రెస్ పార్టీ.. పూర్తిగా బలం పెంచుకొని నిలబడేందుకు ఇంకా తడబడుతూనే ఉంది. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో విజయంపై హస్తం పార్టీ గట్టిగానే దృష్టి పెట్టింది. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని దృఢ నిశ్చయంతో ఉంది. అందుకోసం దేశంలో గ్రామస్థాయి నుంచి పార్టీని తిరిగి బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్ 7 న భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.
కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగిసింది. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్ నింపిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతే కాకుండా పార్టీకి కూడా మంచి మైలేజ్ తీసుకొచ్చింది. దాంతో ఇదే జోష్ ను కంటిన్యూ చేస్తూ రాహుల్ గాంధీ త్వరలో మరో యాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. జోడో యాత్ర ద్వారా దక్షిణ దిశ నుంచి ఉత్తరం వైపుగా యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. త్వరలో చేపట్టబోయే యాత్రను తూర్పు నుంచి పడమర దిశగా చేపట్టబోతున్నారట. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రారంభించి గుజరాత్ వరకు యాత్రను కొనసాగించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇటీవల చెప్పుకొచ్చారు. మొత్తానికి జోడో యాత్ర ఇచ్చిన జోష్ తో రాహుల్ గాంధీ చేపట్టబోయే మరో యాత్రపై కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఆశలు పెట్టుకుంది. మరీ ఈ యాత్రల ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…