కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించారు రాహుల్ గాంధీ. అధ్యక్షుడి హోదాలో పలుమార్లు తెలంగాణలో పర్యటించిన రాహుల్ మార్చి9న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురుచూడటంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏం చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర పర్యటన సందర్భంగా 17 నియోజకవర్గాల పరిధిలోని బూత్ లెవల్ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పాటు చెవేళ్లలో దాదాపు రెండు లక్షల మందితో భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడనున్నారు రాహుల్. రాహుల్ పర్యటన నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం మరోసారి రాహుల్‌ని ఎన్నికల రణరంగంలోకి దించి పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాహుల్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చు కానీ ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.