రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని, ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఎంపీ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. కేంద్ర సర్కారు ఢిల్లీని దుర్భేద్యమైన కోటగా మార్చేసిందని విమర్శించారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గరని, ప్రభుత్వమే దిగిరావాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను పెండింగ్‌లో పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలకుపైగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. రైతులపై ప్రభుత్వం ఎందుకు లాఠీలను ఝుళిపిస్తుందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రక్షణ రంగానికి సంబంధించిన వ్యయాన్ని కేంద్రం కేవలం రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు మాత్రమే పెంచిందని, ఈ పెంపు ద్వారా శత్రు దేశాలకు ఏం సందేశం పంపుతున్నారని నిలదీశారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ద్వారా దేశంలోని 99 శాతం ప్రజానీకానికి మేలు జరుగుతుందని తాము ఆశించామని, కానీ ఈ బడ్జెట్ మాత్రం దేశ జనాభాలో ఒక శాతం మాత్రమే ఉన్న కోటీశ్వరులకు జనం సొమ్ము దోచిపెట్టేలా ఉన్నదని మండిపడ్డారు.